Take a fresh look at your lifestyle.

“ఫిషరీస్ ఫెడరేషన్” పాలకమండలి ఎన్నికలెప్పుడు..?

0 11

“ఫిషరీస్ ఫెడరేషన్” పాలకమండలి ఎన్నికలను నిర్వహించాలి
– తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఫిషరీస్ ఫెడరేషన్)కు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామిక స్ఫూర్తికి, సహకార వ్యవస్థ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి గడచిన పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాల వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది.

అదే సాంప్రదాయాన్ని, పద్ధతులను కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కొనసాగించడం శోచనీయం. కొత్తగా ఏర్పాటు అయిన 23 జిల్లాలకు సహకార సంఘాలను నమోదు చేసి, ప్రజాసామిక పద్ధతిలో సహకార చట్టాల ప్రకారం 33 జిల్లాలలో ఎన్నికలు నిర్వహించి, రాష్ట్రస్థాయి సమాఖ్య (ఫిషరీస్ ఫెడరేషన్)కు పాలక మండలిని నియమించాల్సి ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో ఇప్పటికే అడహాక్ (తాత్కాలిక) కమిటీలను ఎంపిక చేసుకొని, జిల్లా సహకార సంఘాల నమోదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

కొన్ని జిల్లాలలో జిల్లా సహకార సంఘాలకు కూడా పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన జిల్లాల అన్నింటికీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కు పూర్తిస్థాయి పాలక మండలిని నియమించవలసిన తరుణంలో మళ్లీ నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమించడం చట్టవిరుద్ధం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకొని, నామినేటెడ్ చైర్మన్ ను నియమించే పద్ధతికి స్వస్తి పలికి, ప్రజాస్వామికంగా అన్ని జిల్లాలకు జిల్లా సహకార సంఘాల ఎన్నికలను పూర్తిచేసి, రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఫిషరీస్ ఫెడరేషన్)కు పూర్తిస్థాయి పాలక మండలిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని “తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” డిమాండ్ చేస్తున్నది.

పిట్టల రవీందర్,
వ్యవస్థాపక అధ్యక్షులు,
-తెలంగాణ ఫిషరీస్ సొసైటీ.

Leave A Reply

Your email address will not be published.

Breaking