నిర్దేశం, హైదరాబాద్ః ఆఫీసులకు వెళ్లడానికి వెనుకాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నా, ఆఫీసు ఉంటేనే కాస్త రిలాక్సేషన్ ఉంటుందనే వారి సంఖ్యా గట్టిగానే ఉంది! ఈ రోజుల్లో ఇంట్లో కన్నా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లు చాలా మంది ఉంటారు. కరోనా లాక్ డౌన్లు పోయి.. మళ్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కల్చర్ తప్పనిసరిగా మారుతోంది. వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు హాజరు కావాల్సిందే అంటూ చాలా కంపెనీలు కండీషన్లు పెడుతున్నాయి. ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లడానికి వెనుకాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నా, ఆఫీసు ఉంటేనే కాస్త రిలాక్సేషన్ ఉంటుందనే వారి సంఖ్యా గట్టిగానే ఉంది! పని ఒత్తిడి కూడా ఆఫీసులోనే తక్కువ అనే అభిప్రాయ పడే వాళ్లూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఆఫీసులో కలిగే ఆకర్షణలు మాత్రం గట్టిగానే ఉంటాయి. వీటిని నివారించడం కూడా అంత తేలిక కాదు! కాలేజీల్లో ఎంత ఆకర్షణ ఉంటుందో, ఆఫీసుల్లో అంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత అయితే తప్పక ఉంటుంది! ఆఫీసుల్లో కొలీగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లూ కోకొల్లలు! పెళ్లి చేసుకునే ప్రయత్నాలు ఆఫీసులో చేస్తే ఒక లెక్క, అయితే పెళ్లితో నిమిత్తం లేకుండా కలిగే ఆకర్షణల సంగతి ఇంకో కథ!
వృత్తిగత జీవితంలో ఎన్నో మలుపుల తర్వాత ఏదైనా ఒక ఆఫీసులో చేరితే అక్కడ..మన కోసమే అన్నట్టుగా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అదో చిత్రవధ! ఈ చిత్రవధ నుంచి బయటపడటం అంత తేలిక కాదు! ధైర్యంగా వెళ్లి చెప్పేసే పరిస్థితులూ ఉండవు, నివారించుకోవడానికి తప్పించుకు తిరగడమూ సాధ్యం కాదు! ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే! దీనికి తోడు.. ఆఫీసుకు అంటూ కొన్ని నియామవళులు ఉంటాయి. పోష్ అంటారు! పోష్ యాక్ట్ గురించి ప్రతి ఆరు నెలలకూ ఒక సారి క్లాస్ చెబుతారు! ఎవరో లేడీ లాయర్ ను పట్టుకొచ్చి మరీ జాగ్రత్త అన్నట్టుగా అబ్బాయిలకే హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి!
మరి అప్పటి వరకూ కలిగిన ఆకర్షణలను అనుసరిస్తూ ముందుకు వెళ్లడమే తప్ప వెనకేసిన చరిత్ర లేని వారు కూడా ఆఫీసుల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిందే! ఎంత నచ్చినా.. అదుపుల్లో ఉండాల్సిందే! మహా అంటే కళ్లతో వ్యక్తీకరించుకోవచ్చేమో! అయితే అలా అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి! కళ్లతో అతిగా కాంక్షించినా పోష్ కింద బుక్ కావాల్సిరావొచ్చు సుమా!
మరి అలా అన్నింటికీ భయపడితే.. ఆ అమ్మాయి చూస్తున్నా.. చూడలేకపోతున్నానే బాధ తప్పదు! అవకాశం వస్తున్నా.. ఉపయోగించుకోలేకపోతున్నామనే బాధ మెలిపెట్టవచ్చు. మళ్లీ ఆ చూపుల వెనుక ఉద్దేశం ఏమిటో అనే సందేహాలూ తలెత్తవచ్చు! ఇలాంటి తర్జనభర్జనలు ఉంటాయి. మరోవైపు ఆఫీసుల్లో కొన్ని గాసిప్ లూ వినిపిస్తూ ఉంటాయి. ఫలానా వారు బాగా క్లోజ్ అయిపోయారని! అలాంటివి వినిపించినప్పుడు మనమెందుకు ఖాళీగా ఉన్నామనే బాధా కలగొచ్చు!
అయితే ఒక్కసారి ఇలాంటి వాటిల్లోకి దిగితే.. ఆఫీసుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు! అందనమైన అమ్మాయితో తిరుగుతున్నావని ప్రత్యేకంగా టార్గెట్ కు గురి కావాల్సి రావొచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను దెబ్బతినొచ్చు, కాబట్టి.. ఆఫీసు వ్యవహారాల్లో ఆచితూచి వెళ్లడమే ఉత్తమం!