Take a fresh look at your lifestyle.

మళ్ళీ అవే గిల్లి కజ్జాలా?!

0 65,633

ఢిల్లీ వేదిక కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్ళీ గిల్లికజ్జాలకు దిగారు. తమలోని అనైక్యత ను మరోసారి చాటుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పై డిల్లీ వేదికగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ర్ట కాంగ్రెస్ అగ్ర నేతలు పరస్పర ఆరోపణల కే ప్రాధాన్యత ఇచ్చారు. సమావేశ ప్రారంభానికి ముందే రాష్ట్ర పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అసంతృప్తి బాంబు ను పేల్చారు. కరీంనగర్ జిల్లా పార్టీ ఇన్చార్జిగా ఉన్న తనకు సమీక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించ లేదంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ను నిలదీశారు. అంతటితో ఆగకుండా… హుజురాబాద్ ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థిగా డబ్బు లేని బల్మూరి వెంకట్ ను ఎందుకు నిలిపారో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తానని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, ఆమెకు టికెట్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సమక్షంలో జరిగిన వార్ రూమ్ భేటీ లో రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు పరస్పర నిందారోపణలకే ప్రాధాన్యతనిచ్చారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకో, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంత రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఎందుకు ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించ లేదంటూ ప్రశ్నించిన విహెచ్, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోనీ బల్మూరి వెంకట్ కు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కొండా సురేఖ పోటీ చేస్తానని చెప్పినప్పటికీ, ఎందుకని ఆమెను పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపలేదంటూ నిలదీశారు.

ఇక… పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికకు ముందే పార్టీ మారడం వల్లే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్న పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డి ని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికంగా ప్రోత్సహించారని విమర్శించారు. కౌశిక్ పార్టీ మారడం వెనుక ఉత్తమ్ ప్రమేయం ఉందన్న ఆయన, అధికార పార్టీతో మాట్లాడి ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించారని ఆరోపించారు. పొన్నం ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించిన ఉత్తమ్ , కౌశిక్ పార్టీ వీడిన నాలుగు నెల వరకు కూడా పార్టీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదన్నారు. హుజురాబాద్ ఒక్కటే కాదని, దుబ్బాక, సాగర్, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై కూడా సమీక్షించాలని పొన్నం ఈ సందర్భంగా కేసి వేణుగోపాల్ ను కోరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార తెరాస, బిజెపి పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయన్న రేవంత్, పార్టీ నేతల అభిప్రాయాల మేరకే తాను ముందుకు వెళ్లాలని అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై, మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకునే దానికంటే ఐక్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమీక్షా సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే బాగుండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చి పడిన విషయం తెలిసిందే నని వారు గుర్తు చేస్తున్నారు. ఈటెల రాజీనామా చేసిన వెంటనే , అధికార తెరాసకు, ఈటల రాజేందర్ కు మధ్య నే పోటీ అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమయిందని పేర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ఎవరూ పోటీ చేసిన ఫలితం లో పెద్దగా తేడా ఉండేది కాదని , కాకపోతే… ఆర్థికంగా బలమైన అభ్యర్థి పోటీ బరి లో నిలిపి ఉంటే, బల్మూరి వెంకట్ కు వచ్చిన సాధారణ ఓట్ల కంటే, కొంత మెరుగైన స్థాయి ఓట్లు వచ్చి ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు. అయితే…, ముందే ఖరారైన ఓటమి గురించి, కాంగ్రెస్ నేతలు పరస్పర నిందారోపణలు చేసుకోవడం ద్వారా, తమలో తామే పల్చన అవుతూ, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking