Take a fresh look at your lifestyle.

ప్రధాని చెప్పిన రహస్యంలో నిజమెంత..? నష్ట నివారణ చర్యల్లో భాగమేనా..?

0 11

ప్రధాని చెప్పిన రహస్యంలో నిజమెంత..?

  • నష్ట నివారణ చర్యల్లో భాగమేనా..?
  • బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటి కాదని చెప్పే ప్రయత్నం చేసిన మోదీ
  • విపక్షాల ఓట్లు చీల్చడానికేనని కాంగ్రెస్ విమర్శలు

 తెలంగాణలో జరిగిన నష్టాన్ని బీజేపీ అధిష్ఠానం గుర్తించిందా..? నష్ట నివారణ చర్యలను చేపట్టిందా..? అంటే నిజామాబాద్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఔను అనే అంటున్నాయి. ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన దాన్ని మోదీ ఇప్పుడు బహిర్గతం చేయడం నష్ట నివారణలో భాగమేనని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడి పోవడం ఆలస్యంగానైనా గుర్తించింది బీజేపీ అధిష్ఠానం.

నిర్దేశం, హైదరాబాద్ :

 2018లో అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొంది, 110 కి పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పొయిన బీజేపీ ఆ తరువాత ఆరు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుంది. 17 పార్లమెంట్ స్థానాలలో 4 స్థానాలు గెలుపొంది రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలలోనూ ఉనికి చాటుకుంది. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో 48 స్థానాలు గెలుపొంది ప్రధాన పార్టీకి సవాల్ విసిరింది.

రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమనే స్థాయికి ఎదిగింది. కానీ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ నేతలతో పాటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కవితను అరెస్టు చేస్తారని అందరూ భావించారు.

కానీ అరెస్టు చేయక పోవడమే గాక కేసు విచారణలో వేగం తగ్గింది. బీఆర్ ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటంబంపై విమర్శలు చేస్తూ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పక్కన పెట్టారు. దీంతో బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటేననే అనుమానాలు బలపడ్డాయి. బీజేపీ ముఖ్య నాయకలు సైతం మద్యం కేసులో కవితను అరెస్టు చేయక పోవడం వల్ల ప్రజలు నమ్మడం లేదని అంగీకరించారు.

కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో విజయంతో ఆత్మస్థైర్యంతో ఉంది. బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటేననే ప్రచారాన్ని కాంగెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనే స్థాయికి ఎదిగింది. బీజేపీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల అభిమానం ఉన్నప్పటికీ క్యాష్ చేసుకోలేక పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల శాతం పెంచుకోకుంటే పార్లమెంట్ ఎన్నికలలో ఉన్న నాలుగు సీట్లలో కూడా కోత పడే అవకాశం ఉంది. దీంతో బీజేపీ అధిష్ఠానం ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది.

రెండు ప్రభుత్వాల మధ్య పెరిగిన దూరం

బీఆర్ ఎస్ ప్రభుత్వం మొదట్లో ఎన్ డిఎ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి మెలికలు పెట్టలేదు. ఆ తరువాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకక పోవడమే గాక వేదికను కూడ పంచుకోలేదు.

రెండు ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవ్వాళ మీకు చెబుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వాదించాలని కోరారు. తాము ఎన్డీఎలో చేరుతామని ప్రతిపాధించారు. నేను తిరష్కరించాను.’’ అని మోదీ నిజామాబాద్ సభలో అన్నారు.

కేటీఆర్ ను సీఎం చేస్తానంటే వద్దన్నందుకే కేసీఆర్ తన కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం లేదని మోదీ వ్యాఖ్యానించిన దాంట్లో  ఎంత నిజం ఉందానేది తేలాల్సి ఉంది. మూడేళ్లుగా దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడారని పలువురు పలు విధాలుగా చర్చిస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేయడానికి ప్రధాని అనుమతి అవసరం ఎందుకని బీఆర్ ఎస్ నాయకుల ప్రశ్నల్లోనూ అర్థం ఉంది.

ఓట్లు చీల్చి బీఆర్ ఎస్ కు మేలు చేయడానికి కుట్రలు..

ప్రభుత్వ వ్యతిరేక, విపక్షల ఓట్లలో చీలుక వచ్చి బీఆర్ ఎస్ కు మేలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీఆర్ ఎస్ బీజేపీ ఒక్కటేనని ఆ పార్టీలను నమ్మవద్దని పిలుపునిస్తుంది.  

Leave A Reply

Your email address will not be published.

Breaking