Take a fresh look at your lifestyle.

ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

0 68

పోలవరం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 28 : పోలవరం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై సీరియస్‌ అయింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ ఏమీ దానం కాదని వ్యాఖ్యానించింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పర్యావరణ ఉల్లంఘలను ధృవీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు వ్యయం ఆధారంగా గతంలో రూ. 242 కోట్లు ఎన్జీటి పెనాల్టీ విధించింది. అనంతరం ఎన్జీటి తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. నిపుణుల కమిటీ ధృవీకరించిన జరిమానా రూ.24 కోట్లను చెల్లించాల్సిందేనని 17 అక్టోబర్ 2022న ఏపీ ప్రభుత్వానికి ధర్మాశాసనం ఆదేశాలను జారీచేసింది.

ఇక రూ.242 కోట్లు పెనాల్టీ విధించాలా? లేదా? అన్నదానిపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. పురుషోత్త పట్నం రైతులకు ఆరేళ్లుగా నష్టపరిహారం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కె. శ్రవణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే జోషీమఠ్ తరహాలో పోలవరం దగ్గర కూడా భూమిపైన చీలికలు వచ్చాయని న్యాయవాది గుర్తుచేశారు. తదుపరి విచారణలో అన్ని విషయాలను పరిశీలిస్తామని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సుందరేశ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking