Take a fresh look at your lifestyle.

ఎవరూ ఆపలేరు!

0 17

ఎవరూ ఆపలేరు!
*****

ఎంత అలసిపోయినా
పాదాలు పయనాన్నే కోరుకుంటాయి
నడకే అసాధ్యమైన చోట కూడా మార్గం వెతుక్కుంటాయి
బహుశా మరణం దాకా సుదీర్ఘంగా నడచి వెళ్ళడమే వాటికి ఇష్టం కాబోలు…!

కన్నులు మాత్రం తక్కువా…
ఎంత చీకటి ముసిరినా ఎంత కన్నీరొలికినా
కలలు కంటూనే ఉంటాయి
కాలం కళ్ళకు చీకటి పూయగలదు కానీ
కలలకు కాదు కదా అనుకుంటాయి
బహుశా అంతులేని విశ్వాసమొక్కటే వాటి శక్తి కాబోలు…!

లోకంలో కన్నీళ్ళు, పీడన, నిస్సహాయత ఎందుకున్నవి?
గొప్ప చదువులు, జ్ఞానము, మేధస్సు చైతన్యాన్ని ఇస్తున్నవా?
లోకమెందుకు ఇంకా ఇంకా సంక్లిష్టమవుతున్నది?
ప్రేమ, స్వేచ్ఛ, నమ్మకమైన హృదయం లేని ఆధునికత
మనిషిని సౌకర్యవంతమైన అశాంతి వైపు లాక్కెళ్తోంది..
అక్కడ సందేహాలు, అపనమ్మకాలు, ఈర్శ్యలు, పోటీలు, పోట్లాటలు….!
ఇక్కడున్న వాళ్ళమంతా ఈ లోకంలోకి వచ్చే పసిపాపలకు గొప్ప జీవితాన్ని కదా ఇవ్వాలి?
ఏదో వెలితి మనిషిని వేదిస్తోంది!

కానీ ఏదీ ఆగదు…
మానవీయ విలువల పరిశోధన జరుగుతూనే ఉంటుంది
మనుషులు సంతోషాన్ని అన్వేషిస్తూనే ఉంటారు
స్వార్థాలు, సంకుచితాలు తెచ్చే యుద్ధాలు చేయగలిగినంత విధ్వంసం చేసాకైనా ముగియక తప్పదు
మనిషి హృదయం పిడికెడు మట్టినుండి మమతలను పండించుకుంటుంది
కొన్ని పువ్వులను కొన్ని నవ్వులను హత్తుకుంటుంది
సూర్యకాంతిని, వెన్నెలను వెతుక్కుంటుంది
ఒక వర్షపు చినుకు కూడ ఇంధ్ర ధనుస్సై మెరుస్తుంది…
మనిషి జీవితమెప్పుడూ కోటి ప్రశ్నల
కోటిన్నొక్క జవాబుల పరీక్షా సమయం వలె సాగుతూనే ఉంటుంది!
కొత్త కొత్త కలలు చిన్నారి పాపలు చిరునవ్వులు చిందిస్తూ పుడుతూనే ఉంటారు!

– జి. కళావతి

Photo: చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న ఇరవై ఒక్క రోజుల ఈ చిట్టితల్లి రియాన్షి అలియాస్ అన్వి D/O. కిరణ్ రాజ్ & ప్రియాంక

Leave A Reply

Your email address will not be published.

Breaking