Take a fresh look at your lifestyle.

జయ.. తల్లీ నీకు తలోంచి వందనం…

0 16

జయ.. తల్లీ నీకు తలోంచి వందనం…

పదకొండు రోజుల పుస్తకాల పండుగ ముగిసింది. అందులో మూడు రోజులు అనివార్య కారణాల వల్ల నేను వెళ్లలేకపోయాను గాని మిగిలిన ఎనిమిది రోజుల్లో ప్రతి రోజూ కనీసం రెండు గంటల నుంచి ఐదారు గంటల వరకు ఆ పుస్తకాల వీథుల్లోనే గడిపాను. రెండు, మూడు దుకాణాలు మాత్రమే లోపలికి వెళ్లి చూడగలిగాను.
రేపు రేపు అని వాయిదా వేస్తూనే పండుగ ముగిసిపోయింది. అయితే ఆ సమయమంతా పుస్తకాలను మించిన ఆనందం మనుషులను కలవగలగడం. మంచీ చెడూ మాట్లాడుకోగలగడం. వందలో వేలో మంది మిత్రులను కలిశాను. చేతిలో చెయ్యి కలిపాను. పలకరించాను. అలాయి బలాయి తీసుకున్నాను.
ఇరవై ఏళ్ల తరవాత కలిసినవాళ్ల దగ్గరి నుంచి, కొత్తగా పరిచయం అయినవాళ్లదాకా, రోజూ కలిసే వాళ్ల నుంచి నేను చాలా గౌరవించేవాళ్ల దాకా ఎందరెందరో వాళ్లందరికీ వందనాలు.
తీరిక దొరికినప్పుడు ఇంకా వివరంగా రాస్తాను.

జయ పరిచయం

ఈ పదకొండు రోజుల్లోనూ నేను తలమునకలైన పరిచయం జయ. నిన్న సాయంత్రం ఒక స్టాల్ ముందర సమావేశంలో తను మాట్లాడిన మాటలు, అంతకు ముందు నాతో మాట్లాడిన నాలుగు మాటలు తన ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, కుతూహలాన్ని చూపి నన్ను వినమ్రుడిని చేశాయి.
జయ మన హైదరాబాద్ నగరం సజావుగా సాగడానికి అత్యవసరమైన శ్రమ చేస్తున్న లక్షన్నర మంది గౌరవనీయ శ్రామికుల ప్రతినిధి. హైదరాబాద్ నగరపు కోటి మంది రోజురోజూ పారవేసే, విసర్జించే, వృథాచేసే, విరిచేసే, పోగుచేసే దాదాపు తొమ్మిది వేల టన్నుల చెత్త (గార్బేజ్ అని మర్యాదస్తుల ఇంగ్లిష్ పేరు!) ను ఈ లక్షన్నర హస్తాలు సేకరించి, వేరు చేసి, గార్బేజ్ డంపులకు తీసుకువెళ్లి ప్రాసెస్ చేయకపోతే, ఆ పనిని ఒక్కరోజు మానేసినా మన నగరం నివాసయోగ్యం కాదు.

మనకీ నగరాన్ని, మన జీవితాన్ని వాసయోగ్యం చేయడానికి వాళ్లు మన మురికిలో, మనం సృష్టించిన చెత్తలో, దుర్గంధంలో, ప్రమాదకర విషవాయు ప్రసారాలలో మునిగి తేలుతారు. ఆ చెత్త తయారు చేసిన మనం మాత్రం ఆ చెత్తను శుభ్రం చేస్తున్నవారిని అగౌరవంగా, మనుషులే కాదన్నట్టుగా చూస్తాం. “చెత్త మనిషి వచ్చాడు/వచ్చింది” అంటాం!

జయ తల్లిదండ్రులు రెండు దశాబ్దాలుగా ఆ పని చేస్తున్నారు. ఇరవై ఏళ్ల చిన్నారి పొన్నారి జయ ఇవాళ్టికీ ఆ పని చేస్తున్నది. ప్రతి రోజూ ఐదారు వందల ఇళ్ల చెత్త సేకరించే వృత్తిలో ఉంది. అది చెప్పుకోవడానికి సిగ్గు పడని, అవమానపడని ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఒకవైపు ఆ పని చేస్తూనే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ మానేజిమెంట్ కోర్సులతో బి ఎ చదువుతున్నది. యుపిఎస్ సి పరీక్షలు రాసి ఐఎఎస్ కావాలనుకుంటున్నది. చిల్డ్రన్స్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాత్ర నిర్వహించింది. సామాజిక కార్యకర్తగా తన వంతు పని చేస్తున్నది. చిన్న పిల్లలకు చదువు చెపుతున్నది….
జయ ముందర తలవంచి…. తల్లీ, నీకు వందనం.

(జయను పరిచయం చేసినందుకూ, ఈ ఫొటోలు తీసినందుకూ మిత్రులు సజయ గారికి ధన్యవాదాలు)

– ఎన్. వేణు గోపాల్, ‘వీక్షణం’ ఎడిటర్

Leave A Reply

Your email address will not be published.

Breaking