Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పర్యటన

0 48

ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పర్యటన

కామారెడ్డి : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీసమేతంగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వాయుమార్గం లో మధ్యాహ్నం 12 గంటలకు బాన్సువాడ చేరుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా దేవాలయంకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులను దేవస్థాన పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనము ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలతో సన్మానించారు. వేంకటేశ్వర దేవాలయం తరపున సీఎం కేసీఆర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సిఎం మొక్క నాటారు.

దైవ దర్శనం అనంతరం
అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొ న్నారు. తర్వాత అక్కడే స్పీకర్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్పీకర్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లారు. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రజలను కలిశారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు.

సిఎం గారి పర్యటన సాగిందిలా :

ఉదయం 11.05 : బాన్సువాడ పర్యటనకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ గారు.
మధ్యాహ్నం 12 : వాయుమార్గంలో బాన్సువాడకు చేరుకున్న సీఎం కేసీఆర్, శ్రీమతి శోభ దంపతులు. వారితో
పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బి.బి.పాటిల్ తదితరులు ఉన్నారు.

12:30 దేవాలయ పైలాన్ ఆవిష్కరణ, ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం. స్వామి వారికి స్వర్ణకిరీటం బహుకరణ. సీఎం కేసీఆర్, శోభ దంపతులు ప్రత్యేక పూజలు.

మధ్యాహ్నం 1.45 : అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ గారు పాల్గొన్నారు.
సాయంత్రం 4.11 : బాన్సువాడ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్ గారు.

బాన్సువాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం – ముఖ్యాంశాలు (01.03.2023)

• గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం మామూలుగా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా ప్రయత్నం చేశాము.

• పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు తన మిత్రులతో కలిసి ఈ సత్కారాన్ని పూర్తి చేశారు. వారు కోరుకున్న దాని కంటే గొప్పగా ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది.

• భగవంతుడు ఆయన సేవ మనతో చేయించుకుంటాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోసెస్ అని చెప్పినట్లు భగవంతునికి శ్రీనివాస్ రెడ్డి గారి మీద, బాన్సువాడ మీద దయ కలిగింది కాబట్టీ నన్ను కూడా పిలుపించుకొని ఆయనను సేవ ఆయనే చేయించుకున్నాడు. మనం చేసింది ఏమీ లేదు.

• స్వామి కరుణ, దయ కేవలం బాన్సువాడ మీదనే కాదు యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని నేను హృదయపూర్వకంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను.

• ప్రజల సమగ్ర అవసరాలను తీర్చే విధంగా ఈ పుణ్య క్షేత్రం అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఈ రోజే 7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాను.

• నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టినప్పడు అప్పటి స్థితిగతులను గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను.

• తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజీర నదిపై నిజాంసాగర్ కు అనుబంధంగా దేవునూరు ప్రాజెక్టును 50 టిఎంసిల సామర్థ్యంతో తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యాన్ని 30 టింఎసిలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్ – నిజామాబాద్ సరిహద్దులో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపనకు ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే తలంపుతో నిజామాబాద్ ప్రజలే ఎక్కువగా తరలి వచ్చారు.

• నాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్ కు మంచినీళ్ళు అందించే పేరుతో నిజమాబాద్ లో పంటలు ఎండిన కూడా సాగునీరు అందించలేదు.

• ప్రతీ పంటకు ఇక్కడి ఎమ్మెల్యేలు యుద్ధం చేసేవాళ్ళు.

• సింగూరు పై ఆధారపడిన ఘన్ పూర్ ఆయకట్టుకు కూడా నీళ్ళివ్వకపోవడం దారుణ సమస్యగా నేను భావించాను. నాడు ఇలాంటి ఎన్నో సన్నివేశాలను చూసినం.

• నాడు ఎన్నిరకాలుగా ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రులు, పెద్దలతో మాట్లాడినా అది అయ్యేదా పోయేదా అంటూ తృణీకార భావంతో మాట్లాడారు కానీ పరిష్కరించలేదు.

• ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన కారణాల్లో సింగూరు ప్రాజెక్టు కూడా ఒక ప్రబలమైన కారణం. దీని కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు అనేకసార్లు దీక్షలు చేశారు.

• నాడు బోధన సబ్ కలెక్టర్ గా ఉన్న నేటి ఫైనాన్స్ కార్యదర్శి రామకృష్ణా రావు బాన్సువాడ మీదుగా పోతుంటే బతికున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చి గంజి పోసైనా సరే బతికియ్యండి గానీ చచ్చిపోయాక మీరు బిర్యానీ పెట్టి లాభమేందని నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అన్న మాటలను రామకృష్ణారావు నేటికీ గుర్తు చేస్తారు.

• ఈ మట్టిలోనే పుట్టి, ఈ మట్టిలోనే పెరిగిన బిడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు. అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూసే గొప్ప వ్యక్తి. ఆత్మ గల వ్యక్తి.

• నాడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు సభకు హాజరయ్యేందుకు పోతుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడని బాన్సువాడకు 15 కిమీ. దూరంలో ఉన్న మక్కచేళ్ళలో ఉన్న లంబాడా బిడ్డలు చెప్పారు.

• తన స్థాయిని కూడా విస్మరించి వినయ, విధేయలతో తన నియోజకవర్గం బాన్సువాడ ప్రజల అవసరాలను తీర్చేందుకు నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోచారం శ్రీనివాస రెడ్డి అంటే ఇక్కడి ప్రజలకు అంతటి అభిమానం.
• ఇక్కడ పండే పంట మీద, మంచి చెడ్డల మీద శ్రీనావాస్ రెడ్డి గారికి గొప్ప ఆసక్తి ఉంటుంది. ఒక్క బాన్సువాడ ప్రాంతంలోనే 1500 కోట్ల రూపాయల పంట పండిస్తున్నారని ఆయన గొప్పగా చెప్పారు.
• పంట కొనుగోళ్ళ సమయంలో గ్రామగ్రామాన తిరిగి కాంటాలను ప్రారంభించేంత గొప్ప మనసున్న నాయకుడు పోచారం శ్రీనావాస్ రెడ్డిగారు. వారి నాయకత్వంలో ఈ నియోజక వర్గం గొప్ప పురోగతి సాధించింది.
• ఇక్కడి మెటర్నిటి హాస్పటల్ కి అఖిలభారత స్థాయి గుర్తింపు వచ్చింది. నెంబర్ వన్ హాస్పటల్ గా గుర్తింపు పొందింది.
• వయసును దృష్టిలో పెట్టుకోకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు నిరంతరం ప్రజాసేవ చేయాలని నేను కోరుతున్నాను
• బాన్సువాడ ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరముంది.
• పోచారం శ్రీనివాస్ రెడ్డిగారి మీద నాకు ఉండే అభిమానం వల్ల ప్రభుత్వం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు, సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి రూ. 50 కోట్లను బాన్సువాడ నియోజకవర్గానికి నేను మంజూరు చేస్తున్నాను. ఈ నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలో వారి ఇష్టం.
• ఈ పుణ్యకార్యంలో పాల్గొనే అవకాశం కల్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను
• కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా కట్టలేదు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువతో నిజాంసాగర్ ఎప్పుడూ నిండే ఉంటుంది. పచ్చగనే ఉంటుంది.
• వేంకటేశ్వర స్వామి వారి దయతో, ప్రభుత్వం అందించే నిధులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో..
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, బి.బి.పాటిల్, ఎమ్మెల్సీ గంగాధర్, రాజేశ్వర్ రావు, టిఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే లు బాజిరెడ్డి గోవర్ధన్, ఎ.జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, నర్సారెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking