Take a fresh look at your lifestyle.

కామారెడ్డిలో మారుతున్న రాజకీయాలు

0 15

కామారెడ్డిలో మారుతున్న రాజకీయాలు

  • సీఎంపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు…?

  • పస్ట్ లిస్ట్ లో షబ్బీర్ పేరేది..?

  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా..?

  • కేసీఆర్ ను ముదిరాజ్, మైనార్టీల ఓట్లు ఓడిస్తాయా..?

  • బీఆర్ ఎస్ కుమ్ములాటలు ఎవరికి లాభం..

అందరి దృష్టి కామారెడ్డి నియోజక వర్గంపై ఉంది. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే సీఎంపై గుర్రు మీద ఉన్న ముదిరాజ్ లు పెద్ద సంఖ్యలో పోటీ చేయడానికి సిద్దం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షబ్బీర్ పోటీ చేస్తే మైనార్టీలో అతనికే ఓటు వేసే అవకాశం ఉంది. బీఆర్ ఎస్ లో కుమ్ములాటలు కూడా ప్రత్యర్థులకు లాభం చేసే అవకాశం ఉంది.

నిర్దేశం, కామారెడ్డి

గంప గోవర్ధన్ ఔట్.. కేసీఆర్ ఇన్..

సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్యకంగా ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి నియోజక వర్గం నుంచి గంప గోవర్ధన్ పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే.. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజక వర్గంలో తానే పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. దీంతో కామారెడ్డి నియోజక వర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ పై ముదిరాజ్ ల పోటీ..?

అసెంబ్లీ ఎన్నికలలో ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించక పోవడంతో సీఎం కేసీఆర్ పై ముదిరాజ్ లు గుర్రుగా ఉన్నారు. 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ కు ఈ ఎన్నికలలో బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు ముదిరాజ్ పెద్దలు. టికెట్ ఇవ్వకుండా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారని భావించిన ముదిరాజ్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసారు. హైదరాబాద్ లో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేసి ముదిరాజ్ లు తమ సత్తా చాటారు.

షబ్బీర్ అలీ పోటీ చేస్తే..?

కామారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ స్పస్టత రాలేదు. మొదటి నుంచి కామారెడ్డి నుంచి పోటీ చేసేది మాజీ మంత్రి షబ్బీర్ అలీ అనేది అందరికి తెలుసు. కానీ.. మొదటి విడతగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 55 మంది లిస్ట్ లో షబ్బీర్ అలీ పేరు లేక పోవడం చర్చానీయంశంగా మారింది. వ్యూహంలో భాగంగానే కామారెడ్డి అభ్యర్థి పేరు ప్రకటించలేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. ముస్లీం నాయకుడు షబ్బీర్ అలీపై కేసీఆర్ పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీంలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మైనార్టీ పెద్దలు అల్టిమేటం ఇచ్చారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా..?

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ – బీఆర్ ఎస్ మధ్యన పోటీ అనేది జగమెరిగిన సత్యం. రాబోయేది ఈ రెండు పార్టీల మధ్య ఎవరనేది ఇప్పటికీ ఎవరు చెప్పలేని పరిస్థితి. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ ను ప్రాణాలు పోసి బీఆర్ఎస్ తో ఢీ కొనడానికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి పాత్రను ఎవరు కూడా కాదనలేరు. అయితే.. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనేది కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

బీఆర్ ఎస్ లో కుమ్ములాటలు

రాజీనామాకు సిద్దమవుతున్న కౌన్సిలర్ లు..?

కామారెడ్డి జిల్లా బీఆర్ ఎస్ నేతల కుమ్ములాటలు పెరిగాయి. సమన్వయ లోపం, గ్రూపుల తగాదాలు  ఉండటంతో కేసీఆర్ గెలుపుపై ప్రభావం పడుతుందని మంత్రి కేటీఆర్ భావించారు. బుధవారం ప్రగతి భవన్ లోనికి పిలిపించి కొందరు నేతలలో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రగతి భవన్ లో జరిగిన కామారెడ్డి నియోజక వర్గంలోని ముఖ్యుల సమావేశానికి కౌన్సిలర్ లను ఆహ్వనించక పోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. తామంతా బీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేసారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తే ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా లాభం ఉంటుందని భావించారు. కానీ, తాజా పరిస్థితులు చూస్తుంటే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది.

బీజేపీ కూడా గట్టి పోటీ

బీజేపీ అభ్యర్థిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వెంకట రమణ రెడ్డి పోటీ చేస్తారనేది టాక్. అతనికి ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ ఎన్నికలు త్రిముఖ పోటీ కానున్నాయి. ఇంతకు ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking