Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు బీటీ బ్యాచ్ ఝలక్

0 31

కేసీఆర్ కు బీటీ బ్యాచ్ ఝలక్
– తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేకున్నా పదవులు
– కష్ట కాలంలో పార్టీకి గుడ్ బై
– మిగిలేది పాతవారే
– కాంగ్రెస్ లోనూ అదే పరిస్థితి

(ఎం. హన్మంత్ రెడ్డి, జర్నలిస్టు)
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు బంగారు తెలంగాణ (బీటీ బ్యాచ్) ఝలక్ ఇస్తోంది. ఉద్యమ తెలంగాణ ( యూటీ ) బ్యాచ్ ను పక్కన బెట్టి బీటీ బ్యాచ్ కు పదవులు ఇస్తే అనుభవించి కష్ట కాలంలో పార్టీని విడిచి వెళ్తున్నారు. విడిచి వెళ్లేటప్పుడు ఒక రాయి వేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ వివిధ పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఉద్యమ కారులను రాళ్లతో కొట్టిన వారికి టికెట్లు, పదవులు ఇచ్చారు. కేసీఆర్ రెండు తలుపులూ తెరవడంతో 2014 ఎన్నికల సమయంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నేతలు (బీటీ బ్యాచ్ ) వరదలా వచ్చి చేరారు. పార్టీ కోసం, ఉద్యమం కోసం సర్వం ధార పోసిన ఉద్యమ కారులు (యూటీ) బ్యాచ్ కనిపించకుండా పోయారు.

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన (బీటీ బ్యాచ్) నాయకులు ప్రస్తుతం కష్టకాలంలో పార్టీని వదిలి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. కడియం శ్రీహరికి 2014 లో పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. మధ్యలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించి ఆ స్థానంలో శ్రీహరి ని నియమించారు. 2018 ఎన్నికల తర్వాత మళ్లీ మంత్రి పదవి ఇవ్వకున్నా ఎమ్మెల్సీ, ఇటీవల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కే. కేశవరావు కు రెండు సార్లు రాజ్య సభ సభ్యులుగా, కూతురు విజయ లక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చినప్పటికీ పార్టీ మారారు.దానం నాగేందర్ కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమ కారులను కర్రతో తరిమారు. ఈయనను బీఆర్ఎస్ లోకి చేర్చుకుని 2018, 2023 లలో ఖైరతాబాద్ టికెట్ ఇచ్చారు. అందరికంటే ముందుగా ఈయన కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. రాజకీయానుభవం, ఉద్యమ చరిత్ర లేని రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, బీబీ పాటిల్ లకు ఎంపీ టికెట్ లు ఇవ్వగా ప్రస్తుతం పార్టీ విడిచి వెళ్లారు. బీటీ బ్యాచ్ కు చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులు పొందిన వారు అనేక మంది పార్టీ వీడారు.

 

ఉద్యమ కారులపై చిన్నచూపు

బీటీ బ్యాచ్ మోజులో పడిన కేసీఆర్ ఉద్యమ కారులను నిర్లక్ష్యం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన అనేక మందికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. తమను రాళ్లతో కొట్టిన బీటీ బ్యాచ్ తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తుంటే ఉద్యమ కారులు మనో వేదనకు గురయ్యారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందర్, మాజీ మంత్రి రాజయ్య, నాయిని నరసింహా రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ వంటి ఉద్యమ కారులు అవమానాల పాలయ్యారు. వీరే గాకుండా అనేక మంది ఉద్యమకారులకు గుర్తింపు లభించ లేదు.

కాంగ్రెస్ లోనూ అదే పరిస్థితి

కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ గేట్లు తెరవడంతో బీటీ బ్యాచ్ క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్ జెండా మోసిన నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి గాకుండా కొత్తగా వచ్చిన వారికి పార్లమెంట్ టికెట్లు కేటాయిస్తుండడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ను విడిచి వెళ్లరనే గ్యారంటీ లేదని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking