Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ క్యాడర్.. నారాజ్ పెరిగిన కుటుంబీకుల పెత్తనం

0 13

బీఆర్ఎస్ క్యాడర్.. నారాజ్

  • పెరిగిన కుటుంబీకుల పెత్తనం
  • ద్వితీయ శ్రేణికి ప్రాధాన్యం కరువు
  • పనులు లేవు.. పదవులూ రావు

 నిజామాబాద్ జిల్లాలో భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది. అధికారంలో ఉన్నందున ఎవరూ బహిర్గతం కావడం లేదు. పోటాపోటీ ఎన్నికలు జరిగితే అనేక మంది ద్వితీయశ్రేణి నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల వ్యవహారశైలి వల్లే క్యాడర్ నారాజ్ లో ఉంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తరువాత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పటి, ఇప్పటి నాయకుల వ్యవహారశైలిలోనూ తేడా ఉంది.

 నిర్దేశం, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు తెలంగాణ ఏర్పాటైన తరువాత మొదటి సారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలందరు నియోజక వర్గాలలో సామంత రాజులుగా వ్యవహరిస్తున్నారు. వారి కుటుంబీకుల పెత్తనం పెరిగి పోయింది. అన్ని పనుల్లో వారే జోక్యం చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఏ కార్యాలయంలోనూ చిన్న పని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేకు, లేదా వారి కుటుంబీకులకు చెప్పి చేయించుకోవల్సి వస్తోంది. తాము అధికార పార్టీలో ఉండి ఏమి లాభమనే భావనలో ఉన్నారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు నలుగురిని వేసుకుని వెంట తిరుగడానికే పనికొస్తామని వాపోతున్నారు. బహిరంగంగా ఎవరు మాట్లాడకున్నా అంతర్గత చర్చల్లో మాత్రం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పనులు లేవు, పదవులు కూడా లేవని, జేబుల నుంచి ఖర్చు చేసుకుని తిరుగుతున్నామంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గానికో ఆస్థాన కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి పని వారే చేయాలి. కనీసం సబ్ కాంట్రాక్ట్ కూడా ద్వితీయ శ్రేణి నాయకులకు ఇవ్వడం లేదు. అందరూ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒకసారి ఓడి పోతే బాగుంటుందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.

 మంత్రితో మాట్లాడాలంటెనే భయం..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, భవనాలు శాఖ మంత్రి అయినందున ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ మంజూరు చేశారు. కానీ క్యాడర్ తో గ్యాప్ ఉంది. మంత్రితో మాట్లాడాలంటెనే భయ పడుతారు. సోదరుడే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. జూనియర్ లకు, రెండు ఓట్లు వేయించలేని వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. క్యాడర్ తో సరైన సమన్వయం లేదు.

 నిజామాబాద్ రూరల్ లోనూ అదే పరిస్థితి

జిల్లా ఎమ్మెల్యేల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాగా సీనియర్. 1994లో ఆర్మూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అనుచరులకు ప్రాణమిచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆయన వ్యవహార శైలిలో బాగా తేడా వచ్చింది. ఎవరిని పట్టించుకోవడం లేదు. అన్నిట్లో కుమారుడు జగన్ జోక్యం చేసుకుంటున్నాడు. నామినేటెడ్ పోస్టులు అసలైన కార్యకర్తలకు దక్కడం లేదు. కొత్తగా వచ్చిన వారికి అన్నింట్లో ప్రాధాన్యం ఇస్తున్నారు.

 ఎన్నికలు రాగానే జీవన్ రెడ్డి హడావిడి

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎన్నికలు రాగానే హడావిడి చేస్తుంటారు. అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగిస్తారు. ఆ తరువాత వారిని పట్టించుకోరు. దుందుడుకు స్వభావంతో కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డ వారంతా ప్రస్తుతం దూరమయ్యారు. సోదరుడు, గ్రామాలలో బంధువుల పెత్తనం ఎక్కువగా ఉంది. తమను పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

 బోధన్ లో సమన్వయ లోపం

బోధన్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే షకీల్ కు క్యాడర్ కు ఎక్కువగా గ్యాప్ ఉంది. క్యాడర్ తో సమన్వయం లేదు. ఎమ్మెల్యే షకీల్ ఎక్కువ కాలం నియోజక వర్గానికే రాలేదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. శుభకార్యాలకు, పరామర్శలకు రారు. స్థానికంగా కుటుంబీకుల పెత్తనం ఎక్కువగా ఉంది. పట్టణంలో పట్టున్న మున్సిపల్ చైర్ పర్సన్ పద్మాశరత్ రెడ్డిని దూరం చేసుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది.

 నిజామాబాద్ అర్బన్ లో..

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కార్యకర్తలను అసలు పట్టించుకోరు. రాజకీయ నాయకుడి కంటే కంపెనీ సీఈవోగానే వ్యవహారశైలి ఉంటుంది. ఇంటి వద్దకు ఎవరినీ రానియరు. క్యాంపు కార్యాలయానికే రావాలి. శుభకార్యాలకు, పరమర్శలకు వెళ్లరు. నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.


Leave A Reply

Your email address will not be published.

Breaking