ప్రజలు వరదలో, నాయకులు బురదలో కొట్టుకుపోతున్నారు
ఏ కారణం లేకపోయినా ఏదో కారణం కల్పించుకుని మరీ తిట్టుకోవడంలో మన నాయకులు దిట్టలు. అదే కారణం దొరికిందంటే.. ఇక వదులుతారా.
నిర్దేశం, హైదరాబాద్: మన దేశంలో నాయకులకు సహజంగా రెండు స్వభావాలు ఉంటాయి. మొదటిది.. పవర్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో ఆలోచిస్తుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక.. పవర్ లో ఉన్నవారిని ఎలా మిస్ గైడ్ చేయాలో ఆలోచిస్తుంటారు. పరిస్థితి ఎంతటి విపత్కరమైనదైనా సరే మన రాజకీయ నాయకులు ఈ విషయంలో చస్తే కాంప్రమైజ్ అవ్వరు. మరి ప్రజల కోసం ఏమీ చేయరా అంటే.. చేస్తారు. కానీ, అది ప్రజల కోసం చేసేది కాదు. వీళ్ల స్వలాభాలు, స్వార్థాల కోసం చేసే పనుల్లో ఎప్పుడో ఒకటి దారి తప్పి ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ ఒకటి, అరను చూపెట్టి ఐదు, పదేళ్ల కాలాన్ని వెల్లదీస్తూ ఉంటారు.
తాజాగా.. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షం ముంచెత్తింది. ఒకటి, రెండు సార్లు కాదు. ఊపిరిబిగపట్టి లేచినా కొద్ది ముంచెత్తుతూనే ఉంది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల కొద్ది ఇండ్లు నీటి మునిగి ప్రజలు కనీస వసతి లేకుండా పోయారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. నిజానికి, వరదల గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలి. రాబోయే పరిస్థితులను ముందుగానే ఊహించి నివారణ చర్యలు చేపట్టాలి. సరే.. అనుకోకుండా ముంచెత్తింది అనుకుందాం.. వెంటనే సహాయక చర్యల్లో మునిగిపోవాలి. కానీ ఇవేవీ జరగవు. జరిగితే వీటిని భారత రాజకీయాలు అనరు.
ఏ కారణం లేకపోయినా ఏదో కారణం కల్పించుకుని మరీ తిట్టుకోవడంలో మన నాయకులు దిట్టలు. అదే కారణం దొరికిందంటే.. ఇక వదులుతారా. ప్రస్తుతం వరదలపై కూడా తమ లలిత కళలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారికి చేయాల్సిన సాయం ఏంటి? సూచనలేంటనే పట్టింపు లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని విపక్షాల్ని ఎలా బద్నాం చేయాలనే ఉబలాటంలో ఉన్నారు. తెలంగాణలో జరిగిన ప్రాణ నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యతని బీఆర్ఎస్ తీర్మానించేసింది. ఇక ఆంధ్రలో ఉన్న విపక్షం మరో ముందడుగు వేసి.. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారంటూ స్టాంప్ వేసేసింది.
విపక్షాలే ఇంత విపరీతానికి పోతే.. అధికారంలో ఉన్న వారేమైనా తక్కువనా? సహాయక చర్యల్లో ప్రభుత్వం తమ ప్రతిభ కనబరుస్తోందని, అది చూసి విపక్షం ఓర్వలేక పోతోందని ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, విపక్ష నేతలు ప్రస్తుతం ఈ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక ప్రభుత్వం కూడా తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి సత్వర చర్యలు చేపట్టడానికి బదులు.. దాతలు రావాలి, స్వచ్ఛంద చర్యలు చేపట్టాలని స్టేట్మెంట్లు ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతే కాదు, సహాయం కోసం సామాన్యుల నుంచి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు స్పందన లేదు కానీ, విరాళాలు ఇచ్చిన వారి పోస్టులు వెతికి మరీ రిప్లైలు ఇస్తున్నారు.
ఆన్ గ్రౌండ్ లో లీడర్ల ఫీట్లు చెప్పనేలేం. కెమెరా స్విచ్ నొక్కకుండా యాక్షన్ సీన్ లోకి ఎవరూ వెళ్లరు. బాధితులతో మాట్లాడేటప్పుడు దీనంగా ముఖం పెట్టడం, ఆపై భుజం తట్టడం.. మీడియా గొట్టం కనిపించగానే, వీరి కోసం ఎంతైనా చేస్తాం, ఎక్కడి వరకైనా వెళ్తామంటూ గప్పాలు కొట్టడం అతి సాధారణమైన విషయం. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో పరిశీలిస్తే ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. అయినా చేసిన పనిని ప్రచారం చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ ప్రచారం చేసి పని చేయకపోవడమే తప్పు. పని కంటే ప్రచారం ఎక్కువ చేసినా వెగటుగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం? మన రాజకీయ నాయకులకు ఇది తప్పడం లేదు.