Take a fresh look at your lifestyle.

బోసిపోతున్న సచివాలయం.. వర్క్ ఫ్రమ్ హోమ్ లో సీఎం.. మంత్రులు

0 14

బోసిపోతున్న సచివాలయం..
వర్క్ ఫ్రమ్ హోమ్ లో సీఎం.. మంత్రులు
నిర్దేశం, హైదరాబాద్:
నిత్యం సందర్శకులతో కళకళలాడే సచివాయలం ఒక్కసారిగా బోసిపోయింది.లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ వెలువరించడంతో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవ్వరూ సచివాలయానికి రావడం లేదు. దాంతో సందర్శకుల సంఖ్య గణనీయవంగా తగ్గిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణ ప్రజలను కూడా నిర్ణీత వేళల్లో సచివాలయంలోనికి అనుమతిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సచివాలయానికి రావద్దని ఆయన నిర్ణయించుకున్నారు.ఇక మంత్రులు కూడా సచివాలయానికి రావడం లేదు.

మంత్రులు తమ తమ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన రోజూ వారీ వ్యవహారాలను తమ ఇళ్ల నుంచే పర్యవేక్షిస్తున్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రజలు, సందర్శకులు సచివాయలంలో కనిపించడం లేదు. సాధారణంగా సందర్శకులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలోనికి అనుమతి ఉంటుంది. అయితే, మంత్రులను కలుసుకోడానికి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులకు ఆ నిబంధన వర్తించబోదు. కానీ ఎవరైనా మంత్రులను కలుసుకోడానికి ప్రత్యేక అనుమతి తీసుకుంటే సాధారణ వేళల్లోనూ మంత్రుల పేషీ నుంచి భద్రతా సిబ్బందికి సమాచారం వస్తుంది. అప్పుడే వారిని లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులను కలుసుకోడానికి యధావిధిగా అనుమతి ఉంది.

అయినప్పటికీ ఎన్నికల కోడ్ పరిమితుల దృష్ట్యా అన్ని పనులు అవ్వడం లేదని భావించి ఎక్కువ మంది సందర్శకులు సచివాలయానికి రావడం మానేశారు. దీంతో సచివాలయానికి భారీగా రద్దీ తగ్గింది.మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న ఆయా సమస్యలు, జరుగుతున్న పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఎప్పటికప్పుడు సచివాలయం కేంద్రంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే పగడ్బందిగా ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

Leave A Reply

Your email address will not be published.

Breaking