Take a fresh look at your lifestyle.

బలమైన ప్రతిపక్షం బలహీనం

0 18

బలమైన ప్రతిపక్షం బలహీనం
– అధికార పక్షం చేతిలో అవినీతి అస్త్రాలు
– అసెంబ్లీలో వారిదే డామినేట్
– మాట్లాడలేక పోతున్న బీఆర్ఎస్ సభ్యులు

అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ అధికార పక్షాన్ని ఎదుర్కోలేక పోతోంది. అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి కేవలం 15 మంది సభ్యులు మాత్రమే తక్కువగా ఉన్నప్పటకీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని అస్త్రాలుగా మలుచుకుంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు నోటి మాట రావడం లేదు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగం పై శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగట్టారు. ఖజానా కొల్లగొట్టడానికే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కళంకంగా మారిందన్నారు. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఘాటుగా మాట్లాడినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రియాక్టు కాలేకపోయారు. మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తులు చేయకుండా అలాగే ఉంచి కేసీఆర్ ను బద్ నామ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ ఆ సమయంలో సభలో లేరు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆరు సభకే రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అధికార పక్షానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో గట్టిగా మాట్లాడే వారు. కానీ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి బయట పడడంతో ఆయనకు మాటా రావడం లేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్లున్నప్పటకీ సభలో ఏమీ మాట్లాడడం లేదు.
ప్రధాన ప్రతిపక్షానికి 39 మంది సభ్యుల బలం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ సాధించింది. అంటే దాదాపు బలహీన ప్రభుత్వమే. ఐదుగురు పార్టీ మారితే కూలిపోతుంది. ప్రధాన ప్రతిపక్షం 39 సీట్లు సాధించింది. అంటే బలమైన ప్రతిపక్షం. కానీ అధికారం ఉన్న సమయంలో చేసిన అవినీతి, అక్రమాల వల్ల ఆత్మ రక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగట్టాలి. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అనేక కొర్రీలు పెడుతున్నారు. ప్రతీదానికి రేషన్ కార్డు అడుగుతున్నారు. లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు. రేషన్ కార్డులు లేని వారికి సంక్షేమ పథకాలు అందవు. ఆసరా పెన్షన్ నాలుగా వేలకు పెంచుతామన్నారు. రెండు లక్షల పంట రుణం మాఫీ చేస్తామన్నారు. ఎప్పుడు మాఫీ చేస్తారో కూడా చెప్పడం లేదు. వీటి గురించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రధాన ప్రతి పక్షానికి మాట రావడం లేదు.

-(వయ్యామ్మెస్  ఉదయశ్రీ)

Leave A Reply

Your email address will not be published.

Breaking