Take a fresh look at your lifestyle.

అమెరికాలో ఇంటి యజమాని… కేపీహెచ్బీ కాలనీలోని ఇంట్లో దొంగ పట్టివేత!

0 14,589
  • గత ఏడాది అమెరికాకు వెళ్లిన కేపీహెచ్బీ నివాసి
  • ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తింపు
  • వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిన వైనం
  • దొంగను ప్రత్యక్షంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, కాలనీలోని రోడ్ నంబర్ 2లోని ఎల్ఐజీ 237 ఫ్లాట్ లో ఒక వ్యక్తి నివసిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన అమెరికాకు వెళ్లారు. అయితే తన ఇంటికి ఆయన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని చూస్తుండగా ఒక వ్యక్తి గదుల్లో తిరుగుతున్నట్టు గమనించారు. వెంటనే సమాచారాన్ని ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా… ప్రధాన తాళాన్ని పగులగొట్టి, తలుపుకి లోపల గడియపెట్టినట్టు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
సమాచారం అందుకున్న వెంటనే డీఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. తలుపు తీయాలంటూ దొంగను హెచ్చరించారు. దొంగ తలుపు తీయకపోవడంతో… వారు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. దొంగ పడకగది తలుపు వెనుక నక్కాడు. దీంతో, లొంగిపోవాలంటూ డీఎస్సై తుపాకీతో బెదిరించగా, అతను లొంగిపోయాడు. అప్పటికే సదరు దొంగ బీరువా, షెల్ఫ్ లు తెరిచినట్టు గుర్తించారు. తాను చోరీ చేసిన వెండి ఆభరణాలు, నగదును బూట్లలో దాచి, పలు ఆభరణాలను మంచం పరుపు కింద దాచినట్టు పోలీసులు గుర్తించారు.

దొంగను నాగర్ కర్నూలు జిల్లా యాపర్లకు చెందిన రామకృష్ణ (32)గా గుర్తించారు. ఇతను జూబ్లీహిల్స్ లో ఒంటరిగా ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో బోయ్ గా పని చేస్తున్నాడు. ఇళ్లలో చోరీలు చేస్తూ ఇప్పటికే 10 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. రామకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking