బీర్‌పూర్.. విప్లవం @ దళపతి గణపతి ధారావాహిక ఇంట్రో..
నక్సల్స్ ఉద్యమ ప్రస్థానంలో విప్లవానికి ఉదయాలు, అస్తమయాలు మరియు గాయాలు కొత్తేమీ కాదు. నక్సల్ బరిలో మొదలైన విప్లవ తుఫాన్ కొంత కాలంలోనే శ్రీకాకుళం కొండలను ముద్దాడి తెలంగాణ తీరాన్ని తాకింది. విప్లవ కెరటాలు ఉప్పెనలా ఎగిసి పడ్డాయి..! విరిగి పడ్డాయి..
‘గాయపడ్డ సూరీడు’
నక్సల్స్ ఉద్యమ ప్రస్థానంలో విప్లవానికి ఉదయాలు, అస్తమయాలు మరియు గాయాలు కొత్తేమీ కాదు. నక్సల్ బరిలో మొదలైన విప్లవ తుఫాన్ కొంత కాలంలోనే శ్రీకాకుళం కొండలను ముద్దాడి తెలంగాణ తీరాన్ని తాకింది. విప్లవ కెరటాలు ఉప్పెనలా ఎగిసి పడ్డాయి..! విరిగి పడ్డాయి…!! అయినప్పటికీ విప్లవ సాగరం పాత అలలు పడిపోగానే, కొత్త అలలతో ఎగిసిపడుతునే ఉంది.
శరీరాలు నేల రాలుతున్నా శవాలను లెక్కించే మీసాలకు తుపాకులు లేచి సవాలు విసురుతూనే ఉన్నాయి. సమస్యల సాగరంలో రహాస్య పోరాటాల ఎజెండా నుంచి గ్రామ కమిటీల బహిరంగ నిర్మాణం దాకా తెలంగాణ ఉద్యమంలోని అన్ని దశలకు విప్లవం దిశా నిర్దేశం చేసింది. పోరుబాటలో విజయాల రెపరెపలే కాదు, అపజయాల అశ్రుతర్పణలనూ చవి చూసింది.
సమసమాజ నిర్మాణ పోరాటంలో బలహీనతల భంగపాట్లు, కోవర్టుల ఎదురుదెబ్బలూ ఉన్నాయి. ఇన్నేళ్ల ఉద్యమం తర్వాతా ఇపుడేంటి…??? అనే ప్రశ్నలు ఉన్నాయి!
తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే నినాదంతో పల్లె పట్టణం, ఊరు వాడ, చెట్టు గుట్ట అంతటా తామే అన్న నక్సల్స్ మాట నుంచి మేమెక్కడ అంటూ ఆత్మ విమర్శ చేసుకునే స్థాయికి రావడం! వినడానికి వింతగానే ఉంటుంది. అయితే సుదీర్ఘ విప్లవ ప్రస్థానంలో మజిలీలన్నీ విజయ స్థంభాలు కాలేవు. పరాజయాల గాయాలు ఉంటాయి. ఈ ఎదురు దెబ్బల నుంచి నేర్చిందేమిటి..? నక్సల్బరి ఉద్యమ నిర్మాత చారు మజుందర్ లేరు, తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేసిన కొండపల్లి సీతారామయ్య లేరు.
కాని, వారి స్ఫూర్తితో విప్లవ ఉద్యమాన్ని దేశ నలుమూలాలకు తీసుకెళ్లిన మావోయిస్టు దళపతి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఇంకా ఉద్యమ బాటలోనే ఉన్నారు. వారి నాయకత్వంలో “ఎత్తిన జెండా దించకొయ్ అరుణ పతకం జై” అంటూ జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉంది. ఆదునిక సాంకేతిక విప్లవంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా మారడంలో నక్సలైట్ ఉద్యమాన్ని అనగదొక్కడంలో ప్రభుత్వాలదే పై చేయిగా మారుతుంది.
దిన, దిన అభివృద్ధి చెందుతున్న ఆదునిక సాంకేతికత, సోషల్ మీడియా పోకడలతో యువత ఆలోచన దొరని మారడం కూడా నక్సలైట్ ఉద్యమం కనుమరుగు అవుతుందని చెప్పవచ్చు. నక్సలైట్, పోలీసుల తుపాకి తూటాల మధ్య గాయపడ్డ పల్లెల్లో కడుపుకోత కన్నీళ్ళతో దుక్కిస్తున్న తల్లులను కదిపితే సజీవ పరిస్థితి నమ్మలేని నిజాలు మన కళ్ళముందుకు వస్తాయి. మావోయిస్టు దళపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు పుట్టిన ఊరు తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా బీర్పూర్ మండల కేంద్రం.
జర్నలిస్ట్ గా బీర్పూర్ గ్రామాన్ని 2017లో సందర్శించిన సందర్భంగా నాటి అనుభవాలను “గాయపడ్డ సూరీడు” పేరుతో సెప్టెంబర్ 1 నుంచి ధారావాహిక మీ ముందుకు తీసుకు వస్తున్నాను.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్