బీర్‌పూర్.. విప్లవం @ దళపతి గణపతి ధారావాహిక – 01
తూర్పున ఉదయించిన సూరీడు ముద్ద మందారంలా కనిపిస్తున్నాడు. అతని నుంచి వస్తున్న సూర్య కిరణాలు పచ్చని గడ్డిపై పడి ధగ ధగ మెరుస్తున్నాయి.
బీర్‌పూర్..
విప్లవం @ దళపతి గణపతి
ధారావాహిక – 01
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
—————————-
తూర్పున ఉదయించిన సూరీడు ముద్ద మందారంలా కనిపిస్తున్నాడు. అతని నుంచి వస్తున్న సూర్య కిరణాలు పచ్చని గడ్డిపై పడి ధగ ధగ మెరుస్తున్నాయి. చెట్లపై పక్షులు చేస్తున్న గోలతో ఆ ప్రాంతమంతా ఎప్పుడు చూడని వాతవరణం కనిపిస్తోంది. ఆ సమయంలో దుమ్ము రేపుకుంటూ వస్తోంది కారు. ఆ బీర్‌పూర్ ఊరు బోర్డు దగ్గరకు రాగానే ఆగింది. ఆ కారులోంచి దిగాడు సీనియర్ రిపోర్టర్ మల్లేష్, ట్రైని రిపోర్టర్ మానస, కెమెరామెన్ శ్యామ్, అసిస్టెంట్ కెమెరామెన్ నాగరాజ్, లోకల్ రిపోర్టర్ పెద్దన్న.
‘‘సార్..! బీర్‌పూర్ ఊరు బోర్డు దగ్గరనే ఇంట్రో పీటుసీ చెప్పుకుందామా..? ’’ అడిగాడు కెమెరామెన్ శ్యామ్.
‘‘ఓ.కే. చెబుదాం’’ తల వెంట్రుకలు దువ్వుతున్నాడు రిపోర్టర్ మల్లేష్.
‘‘నాగరాజ్..! కారు డిక్కిలోంచి కెమెరా.. స్టాండ్ తీసి పీటూసి చెప్పడానికి సెట్ చేయు. చెప్పక ముందే పని చేయాలి. మీరెప్పుడు నేర్చుకుంటారో ఏమో.. ఇంట్రెస్ట్ లేకుంటే ఎప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్‌గానే ఉండి పోతారు.’’ విసుక్కున్నాడు కెమెరామెన్ శ్యామ్.
కొన్ని క్షణాలలో స్టాండ్ వేసి కెమెరాసెట్ చేసాడు అసిస్టెంట్ కెమెరామెన్.
‘‘సార్.. తొందరగా చెప్పుండ్రి. అగో దూరం నుంచి పశువులు వస్తున్నాయి. అవి రాక ముందే పీటుసీ చెప్పడం పూర్తి కావాలి.’’ అన్నాడు కెమెరామెన్ శ్యామ్.
‘‘ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడు పేరు వింటే చాలు పోలీసులు హడలి పోతారు. మిలిట్రి అలర్టు అవుతుంది. గ్రేహాండ్స్ దళాలు ఏ.కె.47లను ఎత్తి పట్టుకుంటాయి. భూస్వాములు భయపడుతారు. వడ్డి వ్యాపారులు వణికి పోతారు. లంచాలు తీసుకునే ప్రభుత్వ అధికారుల గుండెల్లో గుబులు రేగుతుంది.
ఆ ఒక్కడి పేరు లేని పోలీసు స్టేషన్ లేదు. ఆ ఒక్కడి ఫోటో పట్టుకుని తిరుగని ప్రభుత్వ గూఢచారి లేడు. ఆ ఒక్కడి పేరు వింటే ఎ.సీ. రూమ్‌లలో కూర్చున్న వారికి సైతం వెన్నులో సన్నటి వణుకు పుడుతుంది. పల్లెలలో భూస్వాముల నుంచి ఢల్లీ వయా అమెరికా వైట్‌హౌజ్ వరకు పాలాసీలు తయారు చేసే పాలక వర్గాలకు పక్కలో బల్లెం ఆ ఒక్కడే..
ఆ ఒక్కడి జీవితంలో మరో కోణం కూడా ఉంది.
అతను సాధారణ బడి పంతులు. ఆయన చెప్పిన పాఠలు మిగతా వారు చెప్పిన దానికంటే టోటల్‌గా డిఫరెంట్. కన్న తల్లిదండ్రుల కంటే, తాళి కట్టిన భార్య కంటే, వంశోద్ధారకుడైన కుమారుడు కంటే కూడా తాను నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యం ముఖ్యమని భారత ప్రభుత్వానికి దశాబ్దాలుగా సవాల్ విసురుతున్న విప్లవోద్యమ సారధి, అసమనమైన త్యాగాల సాయుధ దళాల అధిపతి ముప్పళ్ల లక్ష్మన్‌రావు పుట్టిన ఊరే ఈ బీర్‌పూర్..
ఇదీ.. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఓ మారుమూల పల్లెటూర్.
దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధిస్తామని నమ్మిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఊరు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.. ’’ పీటుసీ చెప్పేశాడు మల్లేష్.
‘‘సార్..! పీటుసీ సూపర్.. ఎందుకైనా మంచిది. మరో పీటుసీ చెప్పుండ్రి.’’ అన్నాడు కెమెరామెన్ శ్యామ్.
‘‘శ్యామ్..! బీర్‌పూర్ ఊరు బోర్డు. దూరంగా కనిపిస్తున్న శాంతి స్థూపం. పోలీసులు ఏర్పాటు చేసిన లైబ్రరీ బ్యాక్ రౌండ్‌లో వచ్చెటట్లు కెమెరా సెట్ చేసుకో.’’
‘‘హా.. అవన్నీ బ్యాక్‌రౌండ్‌లో వచ్చెటట్లు కెమెరా సెట్ చేసాను.’’
భారత కమ్యూనిష్టుపార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) మావోయిస్టు దళాల అధిపతి ముప్పాల లక్ష్మణ రావు పుట్టిన గడ్డపై ఇంట్రో పీటుసీ చెప్పాడు రిపోర్టర్ మల్లేష్. ఆ ఇంట్రో పీటుసీ ఎలా చెప్పాడో గమనిస్తోంది ట్రైని రిపోర్టర్ మానస.
కెమెరామెన్ శ్యామ్, అసిస్టెంట్ కెమెరామెన్ నాగరాజ్ ది హైదరాబాద్. వీరికి విప్లవోద్యమంపై ఎలాంటి అవగాహన లేదు. కానీ, అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చే నక్సలైట్ల వార్తలను చదివే వారు. అయినా వారికి నక్సలైట్లను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు లేవు. లోకల్ రిపోర్టర్ పెద్దన్నది పుణ్యక్షేత్రమైన ధర్మపురి. నక్సల్స్ కార్యకలపాల గురించి వార్తలు రాసిన అనుభవం ఆయనకు ఉంది. రిపోర్టర్ మల్లేష్‌ది నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశపల్లి గ్రామం. నక్సల్స్‌కు కేంద్రంగా నిలిసిన ఆ గ్రామంలో పుట్టిన అతనికి విప్లవోద్యమంపై అవగహన ఉంది. రూరల్ రిపోర్టర్‌గా జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టిన అతను నక్సల్స్`పోలీసుల వార్త కథనాలు ‘‘గాయపడ్డ సూరీడు’ శీర్శికతో ‘‘వార్త’’ దిన పత్రికలో దారావాహికంగా ఇచ్చిన అనుభవం ఉంది.
ట్రైని రిపోర్టర్ మానస.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చదువుతూ మూడు నెలలు అప్పైంటిస్ షిప్ ట్రైనింగ్ చేయడానికి టీవీ ఛానల్‌లో చేరింది. కాలేజ్‌లో నాలుగు గోడల మధ్య థియరీ క్లాసులు వినడం మినహా ప్రాక్టీకల్ అనుభవం లేని ఆమె స్పెషల్ స్టోరీలు ఎలా చేస్తారో ప్రత్యక్షంగా చూడాలని ఇన్‌పుట్ ఎడిటర్ సంగప్ప ఆదేశాల మేరకు మల్లేష్‌తో వచ్చింది. ఆ మానస తండ్రి లక్ష్మిపతి యోగా గురువుగా మల్లేష్‌కు పరిచయం.
‘‘సార్.. నాకు తెలియక అడుగుతాను. ఇంతకు నక్సలైట్‌గా ఎందుకు మారుతారు? అడవులకు వెళ్లి కష్టాలు పడటం అవసరమా..? ఇంటికాడా పెళ్లాం, పిల్లలతో హాయిగా ఉండొచ్చు గదా..?’’ అమాయకంగా అడిగింది మానస.
‘‘ఎవరైనా నక్సలైట్‌గా మారాతారంటే అందుకు బలమైన కారణాలుంటాయి. వ్యవస్థలోని కొందరితో తనకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నక్సలైట్‌గా మారచ్చు. లేదా పొద్దంతా కష్టపడి పని చేసిన మూడు పూటలు బువ్వ దొరుకుతలేదని కడుపు మండి నక్సలైట్‌గా మారచ్చు. ఈ రెండు కారణాలే కాకుండా సమాజంలో జరిగే దోపీడిని, అసమనతలను, వడ్డి వ్యాపారుల, భూస్వాముల ఆగడాలు చూసి కూడా నక్సలైట్‌గా మారుతారు.’’ వివరించాడు మల్లేష్.
(2వ ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం..)