Take a fresh look at your lifestyle.

పాలకులకు తొత్తులుగా యూనియన్ నేతలు

0 13

పాలకులకు తొత్తులుగా యూనియన్ నేతలు
– పరిష్కారం కాని జర్నలిస్టుల సమస్యలు
– పోటాపోటీగా సంఘాల ఏర్పాటుతో ఎవరికి లాభం..?
(యాటకర్ల మల్లేష్ )
జర్నలిస్టు యూనియన్.. జర్నలిస్టుల హక్కుల కోసం.. వారి సంక్షేమం కోసం ఏర్పడింది. ఆ యూనియన్ లకు నాయకత్వం వహించే లీడరులు పాలకుల చెంతకు చేరారు. అధికారంతో పాటు ఆర్థికంగా లాభ పడ్డారు. జర్నలిస్టుల హక్కుల కోసం పుట్టుకొచ్చిన జర్నలిస్టు యూనియన్ లు సైతం పాలకులకు జై కొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
జర్నలిస్టుల హక్కులను తమ స్వప్రయోజనాల కోసం పాతర పెట్టిన యూనియన్ లీడర్ లు ఉన్నారు. ఇంత కాలం ఈ జర్నలిస్టు యూనియన్ లీడర్ లను ప్రశ్నించే దమ్ము లేని జర్నలిస్టులు ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి ఆలోచన చేస్తున్నారనిపిస్తోంది. అందులో భాగంగానే కొత్తగా మరో రెండు జర్నలిస్టు యూనియన్ లు ఆవిర్భావించాయి.
ఒక్కటే జర్నలిస్టు యూనియన్
ఒకప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్’ ఒక్కటే జర్నలిస్టు యూనియన్.. 1957లో ఏర్పడిన ఆ యూనియన్ కు తిరుగులేదు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటాలు చేసిన చరిత్ర కూడా ఉంది. కాలక్రమంలో ఆ యూనియన్ లో కొందరి పెత్తనంపై ఆ యూనియన్ లోని జర్నలిస్టులు తిరుగుబాటు చేశారు. చివరకు యాభై ఏళ్ల తరువాత 2007లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి జీ. అంజనేయులు ఆధ్వర్యంలో కొందరు జర్నలిస్టులు ఎంఎస్ హస్మీ, అమరయ్య, కోటేశ్వర్ రావు, సోమయ్య, మంజరి, ఆనందం తదితరులు ‘ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్’ ఏర్పటు చేసి జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం పేరుతో జర్నలిస్టులు ఐక్యం అయ్యారు. ప్రొగ్రెసివ్ ఆలోచనలు గల చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఒక్కటై ఉద్యమాలు చేశారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ ఈ విషయాన్ని గుర్తించారు. అంతే.. ఎంవీ రమణ, క్రాంతి, కందుకూరి రమేష్ బాబు, కొండల్ రావు, జమాల్ పూర్ గణేష్ లాంటి వాళ్లందరితో చర్చించి 2010లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతో అల్లం నారాయణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’ పురుడు పోసుకుంది.
కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలా మంది జర్నలిస్టులు తమ జీవితాలు బాగుపడుతాయని భావించారు. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమంలో పని చేసిన అల్లం నారాయణ నాయకత్వంలో తమకు ఉండటానికి ఇల్లు.. ఉద్యోగ భద్రత.. హెల్త్ కార్డులు వగైరా సదుపాయాలు కల్పిస్తారని జర్నలిస్టులు కలలు కన్నారు. అయినా పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇగో ఇప్పుడు.. అప్పుడు అంటూ ఇళ్ల స్థలాల గురించి సీఎం హోదాలో కేసీఆర్ ఊరిస్తూ కాలయాపన చేశారు. ప్రతి జర్నలిస్టుకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చెబితే జర్నలిస్టులు కలలోనే విహారించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ అండ్ కో టీం మళ్లీ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామిల వర్షం కురిపించారు. కానీ.. జర్నలిస్టులు కేసీఆర్ మాటలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిశారు.
కేసీఆర్ నియంత పోకడలు..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పేరుతో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అతని నియంత పోకడలతో జర్నలిస్టులు మానసికంగా కుంగి పోయారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ ను ప్రశ్నించిన జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ ‘నీది ఏ పేపరు..?’ అని నిలదీసినా కేసీఆర్ వైఖరిపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నోరు విప్పలేరు. ఉపా లాంటి ప్రమాదకరమైన చట్టాన్ని జర్నలిస్టులపై ప్రయోగిస్తున్న కూడా అతని నుంచి స్పందన రాలేదు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పేరుతో ఆర్థికంగా, అధికారికంగా అన్నీ రకాల బాగుపడ్డాది అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి మాత్రమే.
కేసీఆర్ ను కలువడం నిషేధం..
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ రెండు యూనియన్ లు డిమాండ్ చేశాయి. అప్పుడప్పుడు జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన కూడా చేశాయి. కేసీఆర్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించాలని ప్రయత్నించారు.. కానీ.. ప్రగతి భవన్ లోనో.. ఫాం హౌజ్ లోనో ఉండే కేసీఆర్ జర్నలిస్టు యూనియన్ లకు కలిసే అవకాశం ఇవ్వలేరు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడుగా ఉన్న అల్లం నారాయణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పక పోవడానికి కారణం… తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని కేసీఆర్ గిప్ట్ గా ఇవ్వడమే. ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కూడా ఎమ్మెల్యే కావడంతో వీళ్లిద్దరు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పలేక పోయారు. ఈ యూనియన్ ను నమ్ముకున్న జర్నలిస్టుల బతుకులు చిందరవందరైనా కేసీఆర్ ప్రభుత్వంలో పదవులలో ఉన్న వీళ్లిద్దరు మాత్రం అప్పుడప్పుడు జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు అంటూ ప్రకటనలు ఇస్తూ కాల యాపన చేశారు.
మరో రెండు జర్నలిస్టు యూనియన్ లు
పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేరని భావించిన కొందరు సీనియర్ జర్నలిస్టులు ఉద్యమానికి సిద్దమయ్యారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మూడు జర్నలిస్టు యూనియన్ లు ఉన్నాయి. అయితే.. మూడు నెలల క్రితం ఎం.ఎం రహమాన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఎంవీ రమణ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ పేరుతో మరో యూనియన్ ను ఆవిష్కరించారు.
ఆ రెండు యూనియన్ లే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీడబ్లుజే) జర్నలిస్టుల సమస్యలపై గళం విప్పింది. ఏకైక జర్నలిస్టు యూనియన్ కావడంతో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలను ప్రభుత్వాలు ప్రధాన్యత ఇచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ లో శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్ ఈ ఇద్దరి పేర్లు వినిపించేవి. అందుకే వాళ్లిద్దరూ ప్రెస్ అకాడమీ చైర్మన్ లుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగిన అల్లం నారాయణ తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పదేళ్ల పాటు కొనసాగారు.
పోటాపోటీగా ఏర్పడుతున్న యూనియన్ లు తమ సంక్షేమానికి పాటు పడితే బావుంటుందని జర్నలిస్టులు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking