Take a fresh look at your lifestyle.

టిక్కెట్ ఇస్తామనే హామి బీజేపీలో ఇవ్వలేని పరిస్థితి

0 300

బీజేపీకి ఏమైంది…? ఈటెల కినుక ఎందుకు

హైదరాబాద్, మార్చి 15, తెలంగాణ రాజకీయాల్లో బలపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇందుకోసం చేరికలపై మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఓ వైపు రాష్ట్రంలో బలపడేందుకు తమదైన బలాన్ని నమ్ముకుంటూనే.. మరోవైపు బలమైన ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ చాలాకాలంగా ఫోకస్ చేస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని వేసి.. దానికి మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చైర్మన్‌ను చేసింది. అయితే ఈ కమిటీని వేసినా.. తెలంగాణలో బీజేపీలోకి చేరికలు పెద్దగా జరగడం లేదనే చెప్పాలి. బీజేపీ క్షేత్రస్థాయిలో బలంగా లేదని నేతలు నమ్మకం ఇందుకు ఓ కారణమైతే.. పార్టీలో చేరితే తమకు కచ్చితంగా టికెట్ వస్తుందనే నమ్మకం నేతలకు లేకపోవడం మరో కారణమనే వాదన కూడా ఉంది.

చేరికల కమిటీ ఈ విషయంలో నేతలకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని.. ఈ విషయంలో పార్టీ జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని కమిటీలోని నేతలు చెబుతుండటంతో.. పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న అనేక మంది నేతలు వెనకడుగు వేస్తున్నారని ఆ పార్టీలోనూ చర్చ జరుగుతోంది.దీంతో బీజేపీలో చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న మాజీమంత్రి ఈటల రాజేందర్..

ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పదవి తనకు వద్దని ఆయన పార్టీ జాతీయ నేతలకు స్పష్టం చేశారని సమాచారం. అయితే ఈ విషయంలో ఆ పార్టీ జాతీయ నేతలు ఆయనకు సర్ది చెప్పారని.. ఈ విషయంలో తొందరపడవద్దని సూచించారని తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం వెనుక పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించారనే కొంతకాలంగా చర్చ జరిగింది.అయితే ఇటీవల పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశమైన బీజేపీ సీనియర్ నేతలు.. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బండి సంజయ్ నాయకత్వంలోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని.. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్పు ఉండదని వారికి స్పష్టం చేసినట్టు నేతలు చెబుతున్నారు.

దీంతో బండి సంజయ్‌పై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు అసంతృప్తికి గురయ్యారని.. అలాంటి నాయకుల్లో ఒకరైన ఈటల రాజేందర్ చేరికల కమిటీకి రాజీనామా చేయాలని అనుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్న తరుణంలో.. ఈటల రాజేందర్ వ్యవహరం కూడా పార్టీలో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా మారాలని భావిస్తున్న బీజేపీ అంతర్గతంగా భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking