Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌

0 13

బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌
– అభ్యర్థులకు అడుగడుగునా నిరసన సెగలు
– తిరగబడుతున్న ప్రజలు
– దళితబంధు, రేషన్‌కార్డులు ఏవీ అంటూ నిలదీతలు
– కీలక నేతలకు తప్పని అవమానాలు
– గెలుపుపై సడలుతున్న అంచనాలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ అధికార పార్టీలో టెన్షన్‌ నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు నిరసన సెగలు తప్పడంలేదు. దళితబంధు, బీసీ బంధు, రేషన్‌కార్డులు, స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ‘మా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి’ అని బీరాలు పలికిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇప్పుడు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. గెలుపుపై వారి అంచనాలు తప్పుతున్నాయి.

రాష్ట్రంలో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని గులాబీ దళపతి నుంచి అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి వాటి ఫలాలను అందుకుంటున్న వారు బీఆర్‌ఎస్‌ వైపు ఎందుకు నిలవడం లేదన్న ఆందోళన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంతా దాదాపు కోటి మంది లబ్ధిదారులున్నా.. అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించడం లేదని గులాబీ అభ్యర్థులు మదన పడుతున్నారు.

సమాధానం చెప్పుకోలేక..
ప్రచారానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసనలు ఎదురవుతున్నాయి. సమస్యల పరిష్కారం, పథకాల లబ్ధిపై ప్రజలు నిలదీస్తున్నారు. ఇది వారి సహనానికి పరీక్షగా మారింది. దీనిని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పుకోలేక, అవమానాలు భరించలేక ఒక దశలో నేతలు సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా ఓ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ‘సిగ్గు, శరం ఉంటే..’ అంటూ మాట్లాడారు. మరో అభ్యర్థి .. ‘ఇప్పుడు మీ వెనుక తిరుగుతున్నా.. రేపటి రోజున మీరంతా నా వెనుక తిరగాల్సి వస్తుంది..’ అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నియంత్రణ కోల్పోయి పరుష పదజాలంతో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

పోచారంకు సైతం తప్పని నిరసన సెగ..
సీనియర్‌ సభ్యులకు కూడా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదరవుతున్నాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిరసనలు తప్పడంలేదు. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావించిన ఆయనకు ఈ సారి పోటీ చేయడం అనివార్యమైంది. రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రజల నుంచి వ్యతిరేకతను, నిరసనను చవిచూడని పోచారం ఫస్ట్‌ టైమ్‌ ఎదుర్కొంటున్నారు. ప్రచారానికి వెళ్లిన ఆయనకు ముఖం మీదనే ప్రజలు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తుండటం గమనార్హం. మొత్తానికి వారిలో గెలుపు అంచనాలు తలకిందులవుతున్నాయి.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking