Take a fresh look at your lifestyle.

అధికార పార్టీకి సెంటిమెంట్ గండం.. 40 ఏళ్లుగా వరుసగా రెండు సార్లే అధికారం

0 14

అధికార పార్టీకి సెంటిమెంట్ గండం..

–      40 ఏళ్లుగా వరుసగా రెండు సార్లే అధికారం

–      మూడోసారి గెలిస్తే చరిత్రే..

అధికార పార్టీకి సెంటిమెంట్ గండం వెంటాడుతుంది. 40 ఏళ్లుగా వరుసగా మూడో సారి అధికారం ఏ పార్టీ చేపట్టలేదు. రెండు సార్లు వరుసగా అధికారం ఇచ్చి మూడోసారి ఓటర్లు మార్పు కోరుకున్నారు. అభివృద్ది పనులు చేసినా, సంక్షేమ పథకాలు చేపట్టినా, సానుభూతి వచ్చే సంఘటనలు జరిగినా, ప్రజల ఆకాంక్ష నెరవేర్చినా మార్పునే కోరుకున్నారు. సెంటిమెంటో.. ప్రజల విలక్షన తీర్పో చెప్పలేము గాని ఏ పార్టీ హ్యాట్రిక్ సాధించలేక పోయింది.

నిర్దేశం, హైదరాబాద్

ఈసారి బీఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ పై దృష్టి పెట్టింది. బీఆర్ ఎస్ హ్యాట్రిక్ సాధిస్తే కొత్త చరిత్ర అవుతుంది. నందమూరి తారక రామారావు 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించిన తరువాతే ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ఒకే పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారం ఇచ్చారు.  తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేదు. దీంతో ఒకే పార్టీ అధికారంలో ఉంది. 1983లో మొదటి సారి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆఖండ మెజార్టీతో గెలిపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం, ఎన్టీఆర్ సినీ గ్లామర్ తదితర కారణాలు తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడ్డాయి.  1984లో ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంతో కలత చెందిన ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పుకోరారు. దీంతో 1985లో జరిగిన ఎన్నికలలో ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.

ఎన్టీరామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం, భూమి శిస్తు రద్దు, పటేల్ – పట్వారీ వ్యవస్థ రద్దులాంటి నిర్ణయాలు తీసుకున్నారు. తాలుకాల స్థానంలో మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు తీసుకు వచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అనేక మార్పులకు శ్రీకారం చుట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీకి మూడోసారి అధికారం దక్కలేదు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో ప్రజలు రెండోసారి కూడా అధికారం ఇవ్వలేదు. 1994లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 1995లో తెలుగుదేశం పార్టీలో చీలిక ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, 1996లో ఎన్టీఆర్ మరణించడం వంటి సంఘటనలు జరిగాయి. 1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారం దక్కించుకుంది.

చంద్రబాబుపై కనిపించని సానుభూతి

2003లో తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యయత్నం చేశారు. తిరుమల ఘట్ రోడ్ లో మావోయిస్టులు అమర్చిన బాంబు దాడుల నుంచి చంద్రబాబు బయట పడ్డారు. ఈ సానుభూతి వస్తుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఎలాంటి సానుభూతి రాలేదు. తెలుగు దేశం పార్టీ అధికారం కోల్పోయింది. 2004, 2009 ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా…

2009 ఎన్నికల తరువాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయి. యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. చివరికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. 2014లో జరిగిన ఎన్నికలలో ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు గాకుండా ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పటైన బీఆర్ ఎస్ కు పట్టం కట్టారు. బీఆర్ ఎస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికలలో గెలుపొందింది. ప్రస్తుతం బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరిగా పోరాడుతున్నాయి. ఇంతకు సీఎం సీటు ఎవరికి దక్కుతుందో ఎదురు చూద్దాం…

Leave A Reply

Your email address will not be published.

Breaking