Take a fresh look at your lifestyle.

కడియం టార్గెట్ గా గులాబీ వ్యూహాలు

0 17

కడియం టార్గెట్ గా గులాబీ వ్యూహాలు
– కాంగ్రెస్ నేతల సహకారమూ అనుమానమే

వరంగల్:
వ‌రంగ‌ల్ జిల్లా అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలకు క‌డియం శ్రీహ‌రి టార్గెట్‌గా మారారు. కొంత‌మంది బాహాటంగా.. మ‌రికొంత‌మంది సైలెంట్‌గా ఆయ‌న‌కు వ్యతిరేకంగా పావులు క‌దుపుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారారనే అక్కసు బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుండగా.. తమ టికెట్టుకు ఎసరు పెట్టి కాంగ్రెస్ లో కీలకమవుతున్నారనే ఆగ్రహం ‘హస్తం’ నేతల్లో కనిపిస్తున్నది.అనుహ్యంగా కాంగ్రెస్ లోకి జంప్ అయిన క‌డియం శ్రీహ‌రిని రాజ‌కీయంగా దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్‌ వ్యూహాలు రచిస్తున్నది. 

క‌డియం కావ్యను పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఓడించాల‌నే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. వ‌రంగ‌ల్ పార్లమెంట్ స‌న్నాహాక స‌మావేశంలో క‌డియం శ్రీహ‌రిని ల‌క్ష్యంగా చేసుకుని నేత‌లు మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఈ స‌మావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, సార‌య్య‌, పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి, ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి కడియంపై ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు.

క‌డియం శ్రీహ‌రి పార్టీకి ద్రోహం చేశారని, ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.కాంగ్రెస్ లోకి వచ్చి.. కూతురికి టికెట్ ఇప్పించుకుంటున్న కడియంపై కాంగ్రెస్ నేతలు సైతం ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కడియం రాకపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. క‌డియం రావడంతో తమకు ఇబ్బంది అనే భావనలో ఉన్నట్లు సమాచారం. మంత్రులుగా ఉన్న సీత‌క్క‌, కొండా సురేఖ‌లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వ‌ర్గాల్లో చర్చ జరుగుతున్నది. త‌న కూతురి రాజ‌కీయ భవిష్యత్తు కోస‌మంటూ త‌మ నోటికాడి ముద్ద లాగేసుకున్నారని ఆశావ‌హులు భావిస్తున్నారు. కొందరైతే క‌డియం పేరెత్తితేనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. క‌డియం శ్రీహ‌రి చేరికను ఓ మంత్రి, న‌లుగురు ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. కాంగ్రెస్ బ‌లంగా ఉన్న వ‌రంగ‌ల్ నుంచి కూతురును ఎంపీగా గెలిపించుకునేందుకు శ్రీహ‌రి ఆరాటపడుతున్నారు. దీనికోసం పోరాటం మొద‌లు పెట్టారు.

బీఆర్ఎస్ విమర్శలు, ఆరోప‌ణ‌ల‌పై ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ లక్ష్యాన్ని, కాంగ్రెస్‌ అంత‌ర్గ‌త ప్రతికూలతలను ప‌సిగ‌ట్టి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సూచనలతో క‌డియం శ్రీహ‌రి త‌న సీనియారిటీ పక్కన పెట్టి.. కూతురు కావ్యను గెలిపించే బాధ్యతను తీసుకోవాలంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయినిరాజేంద‌ర్ రెడ్డి, నాగ‌రాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డిల ఇంటికి స్వయంగా వెళ్లి మద్దతు కోరడం గమనార్హం. వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేశ్ బరిలో దిగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ బ‌లంగా క‌నిపిస్తున్న ఈ సెగ్మెంట్లలో ట‌ఫ్ ఫైట్ ఉండ‌నుంద‌న్న విశ్లేష‌ణ‌లు వస్తున్నాయి. దీంతో వ‌రంగ‌ల్ స్థానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking