Take a fresh look at your lifestyle.

ఐఎఎస్ పదవికి రాజీనామా రాష్ట్ర మంత్రిగా కేబినెట్ హోదా ఇచ్చిన ఒడిశా సీఎం

0 16

అతను ఐఎఎస్ పదవీకి రాజీనామా చేస్తే..
రాష్ట్ర మంత్రిగా కేబినెట్ హోదా ఇచ్చిన ఒడిశా సీఎం

అదృష్టం కలిసొస్తే నడిచి వచ్చే కొడుకు పుడుతాడట… ఇదో సామెత. కానీ.. ఓ ఐఎఎస్ ఆఫీసర్ నిజాయితీగా విధులు నిర్వహించినందుకు మెచ్చుకున్న ఒడిశా సీఎం అతనికి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ అంటే ఐఎఎస్ పదవికి రాజీనామా చేయించి తన మంత్రి మండలిలోకి తీసుకుని కీలకమైన పదవి ఇచ్చారు. నమ్మడం లేదా.. అయితే.. ఈ స్టోరీ మీ కోసమే..

అడుగులకు మడుగులొత్తే అధికారులను పాలకులు అందలం ఎక్కిస్తారంటారు.. కానీ.. అందరు అలా ఉండరనడానికి ఇదే ఉదాహరణ. తనకు నమ్మిన బంటు.. పదేళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా ఓ ఐఏఎస్ అధికారి చేసిన సేవలను గుర్తించారో ఏమో.. ఏకంగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా కల్పించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

నవీన్ పట్నాయక్‌కు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా (ప్రైవేటు సెక్రటరీ) వీకే పాండియన్.. 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన పదవీ విరమణకు సోమవారమే కేంద్రం ఆమోదం వేయగా.. మర్నాడే ఆయనకు క్యాబినెట్ హోదా పదవి కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పాండియన్‌ను రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ర్యాంకులో ‘5టీ’ చైర్మన్‌గా నియమిస్తూ ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్ మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రాన్స్‌ఫార్మేషన్ ఇనిషియేటివ్, నబీన్ ఒడిశా పథకాలకు ఛైర్మన్‌గా నియమించారు.

కలెక్టర్ గా పనితీరు నచ్చి..

2000 బ్యాచ్ ఒడిశా క్యాడర్‌కు చెందిన పాండియన్.. 2002లో కలహండి జిల్లా ధరమ్‌గఢ్ సబ్-కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం 2005లో మయూర్బంజ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ నుంచి 2007లో గంజాం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. గంజాం కలెక్టర్‌గా ఉన్నప్పుడే నవీన్ పట్నాయక్‌కు పాండియన్ పనితీరు నచ్చింది.

అప్పటి నుంచి నమ్మకస్తుడిగా ఉండటంతో 2011లో సీఎం ఆఫీసులో పోస్టింగ్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్‌కు వ్యక్తిగత సహాయకుడిగా చేరారు.కాగా, ఇటీవలే ప్రభుత్వ హెలికాప్టర్‌లో పాండియన్ రాష్ట్రమంతా చుట్టిరావడం విమర్శలకు దారితీసింది. మోసర్కార్, శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్, బీజూ స్వాస్త్య కల్యాణ్ యోజన (బీఎస్ కేవై) తదితర కార్యక్రమాల రూపకల్పనలో పాండియన్ కీలకంగా పనిచేశారు.

ప్రభుత్వ పథకాల అమలుతో..

ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో మార్పుల వెనుక ఆయన ఆలోచన ఉంది. అయితే, పాండియన్‌ తమ పార్టీలో చేరుతారని, ఆయన కీలక పదవిని సీఎం కట్టబెడతారని అధికార బీజేడీ వర్గాలు ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.తాజా పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. నిన్నటి దాకా అనధికారికంగా చేసింది, ఇప్పుడు అధికారికంగా మారిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘పట్నాయక్ కనిపించని భూస్వామి కావడంతో ఒడిశాలో పరిస్థితి భిన్నంగా ఉంది.. ముఖ్య సహాయకుడు రాష్ట్ర సీఈవోగా వ్యవహరిస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ నేత, ఎంపీ సప్తగిరి ఉలాకా సైతం.. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాండియన్‌ సీఎం పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపడక్కర్లేదని అన్నారు.‘ఒడిశాలో అధికార యంత్రాంగం అలాంటిది.. ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు.. కానీ ఎవరు నియంత్రిస్తున్నారో అందరికీ తెలుసు. మూడు రోజుల సెలవులైనా వీఆర్ఎస్‌ను ఆమోదించడం సూపర్ ఫాస్ట్’ అని ట్విట్టర్‌లో విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking