Take a fresh look at your lifestyle.

ముకర్రం జా జీవిత ప్రస్థానం

0 335

పాతికేళ్ల క్రితం షేర్వానీతో సాదాసీదాగా తిరుగుతున్న ఓ వ్యక్తి చార్మినార్‌,

మక్కా మసీదు ప్రాంతంలో తిరుగాడుతుంటే పోలీసులు ఆయనకు సెక్యూరిటీగా కనిపించారు.

ఆయన ఎవరని ఎస్సైని అడిగాను.

‘ప్రిన్స్‌ ముకర్రంజా.. నిజాం మనవడు..’ అని చెప్పేసరిగా మరింత ఆసక్తి కలిగింది.

హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ పాలన కొనసాగి ఉంటే 8వ నిజాం రాజుగా ఉండేవాడు ముకర్రం జా..

హైదరాబాద్‌ చివరి నిజాం (7వ) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు ఈ ముకర్రం జా..

పూర్తి పేరు నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధిఖీ ముకర్రం జా, అసఫ్ జా VIII..నిన్న (14 జనవరి) టర్కీలో అనామకంగా కన్ను మూశాడు.

ఉస్మాన్‌ అలీఖాన్‌ కుమారుడు అజం జా, ఆయన భార్య దుర్రు షెహ్వార్‌ల(ఒట్టోమన్‌ సామ్రాజ్య చివరి ఖలీఫా అబ్దుల్మెజిద్ II కుమార్తె)కు 6 అక్టోబర్ 1933న ఫ్రాన్స్‌లో జన్మించాడు ముకర్రంజా.

ఉస్మాన్‌ అలీఖాన్‌ ఇద్దరు కుమారులు భోగవిలాసులు కావడంతో వారిపై ఆయన నమ్మకం కోల్పోయాడు.

మనవడు ముకర్రంజాను తన తదుపరి రాజు (నిజాం 8 )గా ఎంపిక చేశాడు.

హైదరాబాద్‌ రాజ్యం పోలీసు యాక్షన్‌ ద్వారా భారత దేశంలో విలీనం కావడంతో ముకర్రం జా సింహాసనం ఎక్కే అవకాశం కోల్పోయాడు. ముకర్రం జాను 1971లో రాజాభరణాలను రద్దయ్యే వరకు 8వ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

హైదరాబాద్‌లో ముకర్రంజా పాలన కొనసాగి ఉంటే 400 ఎకరాల చిరాన్‌ ప్యాలస్‌ (ప్రస్తుతం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌) అధికార కేంద్రంగా ఉండేది. ఏడో నిజాం హయంలోనూ బంజారాహిల్స్‌ను తదుపరి రాజధానిగా అభివృద్ది చేశారు.

ముకర్రం జా విద్యాధికుడు. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో చదువుకున్నాడు.

ప్రధాని నెహ్రూతో ఎంతో సన్నిహితంగా ఉన్న ముకర్రంజా, సంజయ్‌ గాంధీతో విబేధాల కారణంగా 1977 ఎమర్జెన్సీ సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

అక్కడ భారీ గొర్రెల ఫారమ్‌ నిర్వహించాడు. ఆ తర్వాత టర్కీ వెళ్లి దాదాపు జీవితాంతం అక్కడే ఉన్నాడు.

ప్రతి సంవత్సరం హైదరాబాద్‌ వచ్చి తన పూర్వీకులు ఆస్తులు చూసుకుంటూ, గత జ్ఞాపకాలను నెమరువేసుకునేవాడు.

1980నాటి వరకూ ముకర్రంజా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.

నాలుగు పెళ్లిళ్లు చేసుకొని విడాకుల కారణంగా వారికి భరణాలు చెల్లించుకోవడంతో ఆస్తంతా చాలా మేరకు కరిగిపోయింది.

మాజీ భార్యలు కేసులు వేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేనంతగా దివాళా తీశాడు.

చివరకు శేష జీవితమంతా టర్కీలో డబుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌కే పరిమితమయ్యాడు.

భారత దేశంలో హైదరాబాద్‌ విలీనం కాకముందు ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 10 లక్షల పౌండ్లు పాకిస్తాన్‌ పంపాడు.

ఆ డబ్బు లండన్‌ వెస్ట్రన్‌ బ్యాంకులో జమైంది. ఆ డబ్బు మీద భారత్‌, పాకిస్తాన్‌లతో పాటు ముకర్రంజా కూడా న్యాయపోరాటం చేస్తున్నాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే కానీ ఆ డబ్బు చేతికి రాదు.

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్‌తో ముకర్రంజా మొదటి భార్య టర్కీకి చెందిన ఎస్రా చేతిలో ఉంది.

హైదరాబాద్‌లో వారసత్వంగా వచ్చిన ఆస్తులను బంధువులు కాజేశారు. మరి కొన్ని ఆస్తులు అమ్ముకోని పరిస్థితి.

ఒకనాటి దేశంలోనే అతిపెద్ద సంస్థాన వారసుడు, ప్రపంచ కోటీశ్వరుడు ప్రిన్స్‌ ముకర్రంజా జీవితం చివరకు ఇలా ముగిసింది.

ముకర్రంజా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో మక్కామసీదు ప్రాంగణంలోని అసఫ్ జాహీ వంశ సమాధుల దగ్గర నిర్వహిస్తారు.

ఈనెల 17వ తేదీన 8వ నిజాం ముకర్రంజా భౌతిక కాయం హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.

(నేను నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకిని. చారిత్రిక ప్రాధాన్యత, ఆసక్తితో మాత్రమే ఇలా షేర్‌ చేస్తున్నాను)

#Hyderabad #NizamsOfHyderabad #Mukharramjah #8thNizam
Kranti Dev Mitra

Leave A Reply

Your email address will not be published.

Breaking