దారి తప్పిన అసెంబ్లీ.. స్వయంగా మంటపెట్టిన సీఎం

– అక్కలు ముంచారంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన సీఎం
– మహిళలను అవమానిస్తున్నారంటూ మండిపడ్డ బీఆర్ఎస్
– అసెంబ్లీలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి
– ఆర్థిక చర్చ నుంచి ఇరు పార్టీల వైరం వైపు వెళ్లిన అసెంబ్లీ

నిర్దేశం, హైదరాబాద్: రోగి కోరుకున్నదదే, డాక్టర్ ఇచ్చిందదే అన్నట్టుంది తెలంగాణ అసెంబ్లీ పరిస్థితి. ప్రస్తుతం బడ్జెట్ మీద సమావేశాలు జరుగుతున్నాయి. దీనిపై చర్చ ఇటు అధికార పక్షం కాంగ్రెస్ కు, అటు విపక్షం బీఆర్ఎస్ కూ ఆసక్తి లేదేమో.. ఏదో కారణం చూపి చర్చను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే బుధవారం ఒక దుమారం లేసింది. చర్చ సందర్భంగా ‘‘ఇక్కడనున్న అక్కలు ముంచి అక్కడకు వచ్చారు. ఇప్పుడు వారు మీ వెనకాలనే ఉన్నారు. వారిని నమ్మొద్దు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఒంటికాలిపై లేచారు. తావెమరి పేర్లు తీయలేదని అధికార పక్షం సన్నాయి నొక్కుతుంటే, తెలంగాణ మహిళలకు అవమానం అంటూ విపక్ష బీఆర్ఎస్ మరింత నిప్పు రాజేసింది.

ఏడ్చేసిన సబిత
“కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూపిస్తూ.. అక్కడ ఉన్న వారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారో చర్చిద్దాం. ప్రతిసారి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం మోసం చేశాను? ఎవరిని ముంచాను? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది నేనే. ఇప్పుడు ఎమ్మెల్యేగా.. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు” అంటూ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుంటే.. స్పీకర్ జోక్యం చేసుకున్నారు. సభా నాయకుడిని (సీఎం) అగౌరవ పరుస్తున్నారని ఆయన అన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సబిత ఏయే పదవుల్లో కొనసాగారో ప్రస్తావించారు. దాంతో బాగా ఫీలైన సబిత, అసెంబ్లీ హాలులోనే ఏడ్చేశారు.

రేవంత్ కౌంటర్
సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరిపై చర్చ ఉంటుందని అన్నారు. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్కనే సభలో చర్చకు పెట్టింది. కాంగ్రెస్ లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని ఆమెనే నాకు చెప్పింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నేను చెప్పే మాట నిజమా కాదా సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. గవర్నర్ ను రిసివ్ చేసుకొని తిరిగి వచ్చి అందరికీ సమాధానం చెప్తా’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇక అసెంబ్లీ బయటికి రాగానే దీన్ని మరింత రాద్దాంతం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీడియా ముందు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు భావోద్వేగం అవ్వడం, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారాలు, మిరియాలు నూరడం మొదలైంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు వాడివేడి సమాధానాలు ఇవ్వడం, కాంగ్రెస్ నుంచి మహిళా ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయడం మరింత పీక్స్ కి వెళ్లింది. చూస్తుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ రాద్దాంతంతోనే ముగిసేలా ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!