Take a fresh look at your lifestyle.

మోదీ… హామీ ఏదీ?

0 14

మోదీ… హామీ ఏదీ?

  • నిరాశ పరచిన ప్రధాని తెలంగాణ పర్యటన
  • కేవలం రాజకీయ ప్రసంగానికే పరిమితం

నిర్దేశం, హైదరాబాద్:

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముంగిట రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు వస్తున్నందున హామీలిస్తారని ప్రజలు భావించారు. కానీ ఆయన హామీలు ఏమీ ఇవ్వకుండా నిరాశ పరిచారు. కేవలం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని మాత్రమే చెప్పారు. ఆదిలాబాద్ లో జరిగిన విజయ సంకల్పసభలో ఎంపీ సోయం బాబురావు ఆర్మూర్ రైల్వే లైను, యూనివర్సిటీ, విమానాశ్రయం మంజూరు చేయాలని కోరారు. వీటిని మోదీ ప్రస్తావించ లేదు. పసుపు బోర్డు మంజూరు చేసిన విషయాని గుర్తు చేశారు. కానీ దీనికి సంబంధించి అతీగతీ లేదు. కేవలం ప్రకటనే తప్ప పనులేవీ కానరావడం లేదు. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది క్లారిటీ లేదు. తెలంగాణలో కొత్తగా రైలు ప్రాజెక్టులు, జాతీయ రహదారులు చేపట్టాల్సినవి ఉన్నాయి. ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి పనులకు హామీ ఇస్తారేమోనని ఆశగా చూశారు. ఆదిలాబాద్ లో 56 వేల కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

కానీ ఇందులో తెలంగాణకు సంబంధించినవి 6697 కోట్ల విలువైన పనులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒక్క ఎన్టీపీసీకే ఆరువేల కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు, హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని ప్రధానిని కోరారు. వీటిని కూడా ప్రధాని ప్రస్తావించలేదు. పటాన్ చెరు లో 7200 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో సంగారెడ్డి జిల్లాకు చెందిన పనులే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితి ఉంది. దీనిని క్యాచ్ చేసుకోకుంటే గతంలో కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధికి నిర్దిష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరముంది. విజయ సంకల్ప సభలో ప్రజల ఆశీర్వాదం కోరినందున హామీలు కూడా ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం బీజేపీ కార్యకర్తల నుంచే వ్యక్తమవుతోంది.

రాజకీయ ప్రసంగానికే పరిమితం

మోదీ రెండు సభలలోనూ రాజకీయ ప్రసంగాలే చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని,  విచారణను తొక్కి పెడుతోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది. దిల్లీ లిక్కర్ స్కాం కేసును కూడా ఇలాగే చేస్తున్నారు కదా అని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking