Take a fresh look at your lifestyle.

నల్గొండ, జహీరాబాద్ లో బీజేపీలో ఇంటిపోరు

0 13

నల్గొండ, జహీరాబాద్ లో బీజేపీలో ఇంటిపోరు

నిర్దేశం, హైదరాబాద్:
లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో హ్యాట్రిక్ సర్కార్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో అత్యధిక స్థానాలపై కన్నేసిన కషాయ దళం.. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ క్రమలోనే ఇతర పార్టీల నేతలను సైతం కమలం గూటి చేరుకుని పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరిపోయారు.

ఇదే ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. సైదిరెడ్డి చేరికపై గుర్రుగా ఉన్న బీజేపీ క్యాడర్.. ఎంపీ టికెట్‌ మాత్రం ఇవ్వవద్దని తెగేసి చెబుతున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే సీనియర్ నేతలు సైతం తాడోపేడో తేల్చుకుంటామంటున్నారట.పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించాలనిప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. హైదరాబాద్ ఆనుకుని ఉన్న పార్లమెంటు స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

ఇప్పటికే భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను ప్రకటించింది. కానీ నల్లగొండలో బలమైన అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది.రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జోరుగా వలసలు జరుగుతున్నాయి. నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుని కాషాయ కండువా కప్పారు. ఇదే ఇపుడు ఆ పార్టీలో దుమారం రేపుతోంది. ఆ మాజీ ఎమ్మెల్యే పట్ల బీజేపీ క్యాడర్‌, జిల్లా పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమకు కనీస సమాచారం, సంప్రదింపులు లేకుండా నేరుగా ఎలా చేర్చుకుంటారని ముఖ్యనేతలు, క్యాడర్‌ బీజేపీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోందట. సదరు మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరికపై లోకల్ క్యాడర్ అభ్యంతరం వ్యక్తం చేయడం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట.

బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, రాళ్ల దాడులు చేయించిన వారిని ఎలా చేర్చుకుంటారని రాష్ట్ర అగ్ర నాయకత్వంలోని నేతలు కూడా ప్రశ్నిస్తున్నారటసూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ భూములను రక్షించేందుకు ‘గిరిజన భరోసా యాత్ర’ పేరుతో బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు2021 ఫిబ్రవరిలో గుర్రంబోడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ కేసులతో కొందరు బీజేపీ నేతలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ వివాదానికి కారణమని భావిస్తున్న సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని సూర్యాపేట జిల్లాకు చెందిన బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.

ఈ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు సంకినేని వెంకటేశ్వర రావు, భాగ్యరెడ్డిలు పార్టీ అగ్ర నేతలతో విబేధిస్తున్నారట. పార్టీ నేతలను జైలు పాలు చేసినవారిని ఎలా చేరదీస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.నల్లగొండ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే నల్లగొండ ఎంపీ టికెట్ మాత్రం సైదిరెడ్డి ఇవ్వద్దని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారట. పార్టీలో కొత్తగా చేరిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని, తమను అవమానిస్తే తాడో పేడో తేల్చుకుంటామని సీనియర్ నేతలు అంతర్గత సమావేశాల్లో హెచ్చరిస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారట.

జహీరాబాద్ లో….

జహీరాబాద్ బీజేపీలో వర్గపోరు బయటపడింది. ఎంపీ బీబీ పాటిల్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేసారు. ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరాక జహీరాబాద్ లో ఫ్లేక్సీలు కట్టించారు. వాటిని స్థానిక బిజెపి నాయకులే చింపివేసినట్టు అనుమానం. బీజేపీలో బీబీ పాటిల్ చేరికను స్థానిక బిజెపి నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరిక, ఎంపీ టికెట్ రావడం జీర్ణించుకోలేకనే ఫ్లెక్సీలు చింపారని బీబీ పాటిల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. చివరకు బీబీ పాటిల్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైయారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking