Take a fresh look at your lifestyle.

అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ

0 13

అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ

ఐదుగురిపై క్రిమినల్ కేసు నమోదు

హైదరాబాద్, మే 6 : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  భవిష్యత్తు అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల  స్థలంపై గల అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు.
విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండిఏ యాజమాన్యం హక్కులు కలిగిన మూడు (3) ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండిఏ భూరికార్డులను  సరి చూసుకుని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ (ఇంచార్జీ) వెంకటేష్  తమ సిబ్బందితో శనివారం ఉదయం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.

నిర్మాణ దశలో ఉన్న ఐదు (5) ఇండ్లు, ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. కబ్జాదారులు లేదా ఆక్రమణదారులు ఐదుగురిని  గుర్తించి వారిపై  అబ్దుల్లాపూర్  మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.  వాస్తవానికి అబ్దుల్లాపూర్ మెట్ మండలం,  పెద్ద అంబర్ పేట గ్రామంపరిధిలోని ఈ మూడు(3) ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్ఎండిఏ కి అప్పగించారు. ఔటర్ రింగురోడ్డులో భూములు కోల్పోయిన వారికి ప్రత్యన్మయంగా భూమి ఇచ్చేందుకు వీలుగా  ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండిఏకి కేటాయించడం జరిగింది. హెచ్ఎండిఏ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking