Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కు అభ్యర్థులు కావలెను

0 28

బీఆర్ఎస్ కు అభ్యర్థులు కావలెను
– ఇద్దరు సిట్టింగ్ ల జంప్
– అదే బాటలో మరొకరు
– చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటికి దూరం
– పార్లమెంట్ ఎన్నికల ముంగిట డీలా
నిర్దేశం, హైదరాబాద్
ఒకప్పుడు ఆ పార్టీ టికెట్ కోసం ఫుల్ డిమాండ్ ఉండేది. టికెట్ వస్తే చాలు గెలుస్తామని భావించే వారు. పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వడమేగాక, ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టికెట్ ఇస్తామన్నా పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆపార్టీ తరఫున పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు. తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలలో ఇప్పటికే ఇద్దరు వేరే పార్టీలో చేరిపోయారు. మరొకరు పోటీ చేయబోనని అధిష్ఠానానికి చెప్పేశారు. ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎంపీకి పోటీ చేసే అవకాశం లేదు. మిగతా ఐదుగురు సిట్టింగ్ లలో కూడా ఒకరు పార్టీ మారుతారనే ప్రచారముంది. మిగిలిన వారిలో ఎవరు పోటీ చేస్తారనేది అనుమానంగా ఉంది. ఇదీ మొన్నటి వరకు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ తాజా పరిస్థితి. అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి తిరుగులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గౌరవప్రదంగా 39సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజురోజుకు బలహీన పడుతోంది. పార్టీలో ఎవరుంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది.

పోటీకి చేవెళ్ల ఎంపీ దూరం
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అధిష్ఠానానికి చెప్పేశారు. దీంతో అధిష్ఠానం మరో అభ్యర్థిని వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరూ పోటీకి సిద్ధంగా లేక పోవడంతో మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయనుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి పోటీ చేయనున్నారు. సునీతా రెడ్డి భర్త మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బలమైన వారు. కాంగ్రెస్ కు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గానికి ఇన్ చార్జీగా ఉన్నందున ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీలకు అనుకూల పరిస్థితి ఉండడంతో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి డబ్బులెందుకు ఖర్చు చేసుకోవాలని రంజిత్ రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తున్నారు.

రాములు బీజేపీలో చేరిక
నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ ను వీడి గురువారం బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన బీజేపీ లో చేరే అవకాశముంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇది వరకే కాంగ్రెస్ చేరారు. ఆదిలాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జి. నగేష్ బీజేపీలో చేరారు. నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నియోజక వర్గాలలో సరైన అభ్యర్థులు లేరు. ఎవరో ఒకరిని నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెదక్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని పోటీకి ముందుకు రావడంలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking