Take a fresh look at your lifestyle.

చైనా నిఘా బెలూన్​ను కూల్చేసిన అమెరికా..

0 84

అమెరికా గగనతలంలో సంచరిస్తున్న చైనా నిఘా బెలూన్​ను ఎట్టకేలకు పెంటగాన్​ కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలకు మేరకు శుక్రవారం అట్లాంటిక్‌ సముద్రంలో ఆ బెలూన్‌ను కూల్చివేసినట్టు రక్షణశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్‌-22ను రంగంలోకి దించిన ఆమెరికా.. ఎయిర్‌ ఇంటర్‌సెప్ట్‌ క్షిపణి 9 ఎక్స్‌ సైడ్‌విండర్‌ను ప్రయోగించి చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసింది.

ప్రస్తుతం అమెరికా సైన్యం ఆ బెలూన్‌ శకలాలను సేకరించే పనిలో పడ్డది. ఓ భారీ క్రేన్‌తో కూడిన రెండు నౌకాదళ షిప్‌లు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. శకలాల ఆధారంగా నిఘా అంశంపై అమెరికా ఓ నిర్ధారణకు రానున్నది. ఈ బెలూన్‌ పౌర గగన నౌక అని, వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించిన ఈ బెలూన్‌ దారితప్పిందని చైనా చెబుతుండగా.. తమ దేశంలోని వ్యూహాత్మక స్థావరాలపై నిఘా పెట్టేందుకు చైనా దీన్ని ప్రయోగించిందని అమెరికా పేర్కొంటున్నది. మరోవైపు, తమ బెలూన్​ కూల్చివేయడంపై చైనా తీవ్రంగా స్పందించింది. అది వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించినదని చెప్తున్నప్పటికీ దాన్ని కూల్చివేసిందని, దీనికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని ఆ దేశ విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking