Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ కు నష్టం చేసే కోమటిరెడ్డీ సంగతేంటి..?

0 157

క్రమశిక్షణ లోపంతోనే కాంగ్రెస్ కు నష్టమా..?

ఎవరికి వారే ఏది మాట్లాడినా చర్యలు శూన్యం..

కాంగ్రెస్ ను లేపడానికి రేవంత్ రెడ్డి ముందుకు అడుగులు

హైదరాబాద్, ఫిబ్రవరి 15, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలే కష్టాల్లో ఉంది. పాదయాత్రలతో ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే జోష్ పెరుగుతుంది. రెండు దఫాలుగా అధికారానికి దూరమయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలవకపోతే దాని మనుగడ కూడా కష్టమే. ఇప్పటికే ఓటు బ్యాంకుతో పాటు క్యాడర్ కూడా మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ కు ఓటు వేసినా వృధాయేనని, తాము ఓటు వేసి గెలిపించినా వారు టీఆర్ఎస్‌లోకి వెళతారన్న భావన ప్రజల్లో పెరిగిపోయింది. లంగాణలో పొత్తులపై కాంగ్రెంస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు గందరగోళంతో ఉన్న పార్టీ ఈ మధ్యే కొంత ప్రశాంతంగా మారి.. జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి సొంత పార్టీలోనే అగ్గి రాజేస్తున్నాయి. కాంగ్రెస్‌తో సీఎం కేసీఆర్ కలవక తప్పదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణంలో వచ్చేది హంగ్ మాత్రమేనని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీలన్న కోమటి రెడ్డి.. ఎవరికీ 60 సీట్లు రావంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణ ప్రజల సంగతి అటుంచితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎవైనా స్టేట్‌మెంట్లు ఇచ్చేటప్పుడు ముందూవెనుక చూసుకోవాల్సిన పని లేదా అంటూ అంతెత్తున లేస్తున్నారు.

ముందు నుంచి ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో.. కోవర్టు అనే పదాన్ని వాడుకలోకి వచ్చేలా చేసిన కోమటిరెడ్డి.. ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో మరోసారి సొంత పార్టీలోనే కుంపటి పెట్టేశారు. రెండు దఫాలుగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోవడంతోనే ప్రజల్లో ఈ రకమైన భావన నెలకొంది.అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొంత పరిస్థితి మెరుగుపడిందనుకునేలోగా ఏదో రూపంలో అది ఇబ్బందులు పడుతూనే ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్‌ఛార్జి వచ్చారు. మాణికంరావు థాక్రే ఏదో ప్రయత్నాలు ప్రారంభించారు. నేతలందరినీ ఒక తాటిమీదకు తెచ్చి కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.

యాభై నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగుతుంది. మరికొద్ది రోజుల్లో సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలరం రేపుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. వినడానికి బాగున్నా… అంతవరకూ ఊరుకుంటే బాగుండేది. కానీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదని చెప్పారు.

బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా నిలువరించాలంటే రెండు పార్టీలు కలవక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి కూడా అరవైకి మించి సీట్లు రావని కూడా చెప్పారు. ఒక సీనియర్ నేతగా తాను ఈ మాటలు చెబుతున్నానని అనడమే కాకుండా, ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ పార్టీ గెలవదని కూడా అనేశారు. ఎన్నికల అనంతరం పొత్తు ఖాయమంటూ ఆయన అనడం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతుందికోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో సర్వే చేసి చెప్పలేదు. ఆయనకున్న అనుభవంతో చెప్పానంటున్నారు. అంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పకనే చెప్పారు.

మరి ప్రజలు ఎందుకు కాంగ్రెస్‌కు ఓటేస్తారు? అదేదో బీఆర్ఎస్ కు వేస్తే సరిపోతుంది కదా? అని అనుకునే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉండి డ్యామేజీ చేయడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, పార్టీ క్యాడర్‌ను కన్‌ఫ్యూజ్ చేయవద్దని సీనియర్ నేత వీహెచ్ కూడా అన్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అన్నారో తెలియదు కానీ కాంగ్రెస్ కు నష్టమేనంటున్నారు ఆ పార్టీ నేతలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking