Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేంద్ర మంత్రి

0 27

తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ, ఏప్రిల్ 17 (వైడ్ న్యూస్)  అడవుల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఉపయోగించు కోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధులను గురించి ఆయన గుర్తు చేశారు. ఆ లేఖ ఇదే..

గౌరవనీయులైన శ్రీ కె. చంద్రశేఖర రావు గారికి నమస్కారం,

విషయం : అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళిక ప్రకారం “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” (CAMPA) క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధులను గురించి.

ప్రకృతిని పరిరక్షించటం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఎన్నో రకాల వన్యప్రాణులకు, ప్రత్యేకమైన ఉత్పత్తులకు, ఔషధమూలికలకు, గిరిజన ప్రజలు తదితరాలకు ఆవాసాలుగా ఉన్న అడవులు ఈ ప్రకృతిలో ఒక భాగం. కాలానుగుణంగా ఉత్పన్నమయ్యే మానవ అవసరాల కొద్దీ చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కొన్ని ప్రాంతాలలో ఈ అడవులను ఉపయోగించుకోవలసి వస్తోంది. అలాంటి సమయంలో కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తోంది. తద్వారా, ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమేకాకుండా, ప్రాకృతిక విపత్తులు సంభవించటానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని నిశ్చయించుకుంది. అందులో భాగంగా చెట్లను విరివిగా నాటి పచ్చదనాన్ని పెంచటం ద్వారా ఆయా ప్రాంతాలలో కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని తిరిగి పెంపొందించవచ్చని భావించి “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” (CAMPA) ను ఏర్పాటు చేయడం జరిగింది.

అడవుల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలిపి, CAMPA ఫండ్ క్రింద గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలకు అనుగుణంగా ఈ నిధులను వినియోగించుకోవలసి ఉంటుంది. 2019-20 నుండి 2021-22 వరకు గత 3 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే, ఆమోదం పొందిన వార్షిక ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న విషయం స్పష్టమవుతుంది.

వినియోగానికి ఆమోదం పొందిన నిధుల విలువకు, వినియోగించుకున్న నిధుల విలువకు దాదాపు రూ. 610 కోట్ల వ్యత్యాసం ఉంది. అడవుల పెంపకం కోసం CAMPA ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళికల లక్ష్యాలను చేరుకోవడం లేదు. దీని ప్రభావం ఆయా అడవులలో నివశిస్తున్న వివిధ వన్యప్రాణుల మీద చాలా బలంగా పడుతోంది. తెలంగాణలో పులుల సంఖ్య తగ్గుతోందని, సత్వరమే సంరక్షణ చర్యలను చేపట్టాలని సూచిస్తూ ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దేశంలో పులుల సంఖ్యకు సంబంధించి విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

అడవుల పెంపకం కోసమే కాకుండా, అడవుల సంరక్షణ కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం, పార్కులు, జంతుప్రదర్శన శాలల నిర్వహణ కోసం కూడా వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల క్రింద సమయానుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. ఇలా ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, ఆయా పథకాల క్రింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన రూ.2.20 కోట్ల నిధులను కూడా విడుదల చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.

కావున, ఈ విషయాల పట్ల మీరు ప్రత్యేకమైన చొరవ చూపించి, CAMPA ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ రాష్ట్రంలో కోల్పోయిన అడవుల విస్తీర్ణాన్ని తిరిగి పెంపొందించటానికి తగిన చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధులను సత్వరమే విడుదల చేసి వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడాలని కోరుతున్నాను.

ధన్యవాదాలు,

జి. కిషన్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking