Take a fresh look at your lifestyle.

నయీం కేసులో ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు

విచారణ జరిపిస్తే పోలీసు అధికారులకు జైలు తప్పదు.. బినామీ ఆస్తులు వెలుగులోకి రావచ్చు..

0 2,509

నయీం కేసులో ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు

  • నయీంతో నేరం చేసిన పోలీసు అధికారులకు ప్రమోషన్ లా..?
  • నాగిరెడ్డి సిట్ నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తొక్కి పెట్టింది..?
  • నయీం బినామీ ఆస్తులు ఏమయ్యాయి..?
  • మరో కేసు నమోదు చేసి విచారణ జరిపించాల్సిందే..?

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

నయీం కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం నయీంను ఎన్ కౌంటర్ లో మట్టు పెట్టిన తరువాత సిట్ అధికారులు తమ నివేదికను కేసీఆర్ ప్రభుత్వానికి అంద చేశారు. అయినా.. ఆ ప్రభుత్వం ఆ నివేదికను బుట్టలో వేయడానికి గల కారణాలు తెలుసుకోవాల్సి ఉంది. నరహంతకుడు నయీంతో సంబంధం ఉన్న పోలీసు అధికారుల పాత్రను వెలికి తీయాల్సి ఉంది. నయీం కేసును పటిష్ఠంగా తీసుకుని మరో కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ సామాజిక వర్గం పోలీసు అధికారులను పక్కన పెట్టి నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులతో విచారణ జరిపించినప్పుడే నయీం బాధితులకు న్యాయం జరుగుతుంది.

పోలీసు అధికారుల గుండెల్లో గుబులు..  

నరహంతకుడు నయీం కేసు తెరపైకి రావడంతో అతనితో సంబంధం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో గుబులు రేగుతుంది. నయీం ముఠా చేసిన ఆరాచకాలతో ఎస్ ఐ నుంచి డీజీ స్థాయి అధికారి వరకు సంబంధాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఇప్పటికే ప్రమోషన్ పొంది విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో పాటు పొలిటికల్ లీడరులు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తోంది. నేరస్తుడికి సహాకరించిన ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే.. నయీంకు సహకారించిన పోలీసు అధికారులను నేరస్తులుగా పరిగణించి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

అసెంబ్లీలో నయీం కేసు ప్రస్తావన..

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అసేంబ్లీలో ప్రస్తావించారు. నయీంతో సంబంధం ఉన్న బీఆర్ ఎస్ పెద్దలతో పాటు పోలీసు అధికారులు శిక్ష అనుభవించాల్సిందేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలకు నయీంతో లోపాయికారి సంబంధాలు ఉన్నట్లు నాగిరెడ్డా సిట్ నివేదిక పేర్కొంది. అలాగే నయీం చేసిన నేరాలకు సహకారించిన పోలీసు అధికారులు లాభ పడ్డారనే విషయాన్ని ఆ నివేదికలో వివరించారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్ నివేదిక ఆధారంగా కేసీఆర్ సామాజిక వర్గం పోలీసు అధికారులను గాకుండా ఇతర అధికారులతో విచారణ జరిపించాలనే డిమాండ్ పెరుగుతుంది.

నయీం బినామీ ఆస్తులు ఏమయ్యాయి..?

నయీం చాలా కాలం నేర సామ్రాజ్యాన్ని ఏలాడు. అతనికి ఎదురు చెప్పే వారే లేకుండా అయ్యారు. ముఖ్యంగా  నక్సలైట్లను అంతమొందించడానికి కొందరు పోలీసు అధికారులు నయీంను పావుగా ఉపయోగించుకోవడంతో చివరకు నయీం నేరాలకు పాల్పాడ్డారు. అయినా.. అన్నీ తెలిసీ కూడా ప్రభుత్వం నయీం ముఠాపై చర్యలు తీసుకోలేదు. పైగా పోలీసు అధికారులు నయీంతో కోట్ల రూపాయలు లాభ పడ్డారు. నయీం ఎన్ కౌంటర్ తరువాత రూ. 100 కోట్ల మేర ఆస్తుల్ని సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. అనాధికారికంగా వెయ్యి కోట్లు ఆస్తులున్నాయనేది నిజం. ఆ ఆస్తులు ఇప్పుడెక్కడున్నాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

బీఆర్ ఎస్, పోలీసు పెద్దల పేరుతో..

నయాం ఎన్ కౌంటర్ తరువాత అతని బినామీ ఆస్తులను పోలీసు అధికారులు, బీఆర్ ఎస్ పెద్దల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నయీం కేసును గాలికి వదిలి వేయడం చర్చనీయాంశంగా మారింది. నయీం కేసులో 18 చార్జిషీట్లు కోర్టులో దాఖలయ్యాయి. దాదాపు 800 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వంద మందికి పైగానే కస్టడిలోకి తీసుకుని ఇంటార్ గేషన్ చేశారు. నయీం నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న 18 మందిపై పీడీ యాక్ట్ పెట్టారు. కానీ.. నయీంతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేరు. వాళ్లిప్పుడు ప్రమోషన్ లు పొంది విధులు నిర్వహిస్తున్నారు.

మరో కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి..

నయీం కేసులో బాధితులకు న్యాయం జరుగాలంటే మరో కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక వర్గానికి ప్రధాన్యత ఉండేది. అయితే.. ప్రస్తుతం నయీం ముఖ్యమైన కేసు కూడా నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఉంది. ప్రస్తుతం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగే అవకాశం ఉంది. ఇంతకాలం కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను పక్కన పెట్టి నిజాయితీగా విధులు నిర్వహించే వారితో విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా నయీం కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి అతనితో సంబంధం ఉన్న పోలీసు, బీఆర్ ఎస్ పెద్దలను చట్ట రీత్యా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking