Take a fresh look at your lifestyle.

భాషా పండితుల సస్పెండ్ ఉత్తర్వులను..

0 73

భాషా పండితుల సస్పెండ్ ఉత్తర్వులను

ఉపసంహరించుకోవాలి

సిఎం కు లేఖ రాసిన ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్ ఫిబ్రవరి 21 : భాషా పండితులను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భాషా పండితుల ప్రమోషన్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అద్యక్షులు ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ కు లేఖ రాసారు.

ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. భాషా పండితులు చేస్తున్న సేవలను గురించి సత్కరించాల్సిన రోజు. రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడం అత్యంత దురద్రుష్టకరం. ప్రమోషన్లు అడిగినందుకు ముగ్గురు భాషా పండితులను సస్పెండ్ చేయడం గర్హనీయం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన భాషా పండితులకు ఇచ్చే కానుక ఇదేనా? రాష్ట్ర ప్రభుత్వ చర్యను భారతీయ జనతా పార్టీ, తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 8,500 మందికిపైగా భాషా పండితులున్నారు. వీరికి 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వలేదనే విషయం మా ద్రుష్టికి వచ్చింది. వేల మంది ఉద్యోగులకు అర్హత ఉన్నప్పటికీ 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం దారణం. వీరంతా ఇంకా ఎస్జీటీలుగానే కొనసాగుతుండటం బాధాకరం. నిబంధనల ప్రకారం ప్రాధమికోన్నత తరగతుల వరకే బోధించాల్సి ఉన్నప్పటికీ… అందుకు భిన్నంగా 9, 10 తరగతుల విద్యార్థుల బోధనా తరగతుల బాధ్యతలు కూడా వీరిపై మోపడం ఏ మాత్రం సరికాదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న తమ ప్రమోషన్ల సమస్యను పరిష్కరించకుండా, బలవంతంగా అదనపు భారం మోపడమంటే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగానే భావిస్తున్నామని,
ఈ విషయంలో న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న భాషా పండితులపట్ల సానుకూలంగా స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సస్పెన్షన్ల పేరుతో అణిచివేత ధోరణిని అవలంబిస్తుండటం క్షమించరాని విషయమని అన్నారు.

హైదరాబాద్ లో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భాషా పండితులకు వెంటనే ప్రమోషన్లు కల్పిస్తామని మీరిచ్చిన హామీ ఏమైంది? ఇంతవరకు అమలు చేయకపోవడం సిగ్గు చేటు. కోర్టులో కేసు ఉందనే సాకుతో 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకుండా నాన్చివేత ధోరణిని అవలంబించడం ఏమాత్రం సరికాదు. తక్షణమే కోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు అర్హులైన భాషా పండితులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

అట్లాగే ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భాషా పండితుల పక్షాన బీజేపీ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా న్యాయపరమైన కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.దీంతోపాటు తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుండి జీతాలు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking