Take a fresh look at your lifestyle.

ఏదో మిస్సింగ్ ఈ ప్రపంచంలో…!

0 15

ఏదో మిస్సింగ్ ఈ ప్రపంచంలో…!
**********

నా దగ్గర ఒక వెచ్చటి గది ఉంటే
నేనూ చలిని చూసి చిరునవ్విడుదును…
నా దగ్గర ఒక వెచ్చటి పడక ఉంటే
నేనూ చలిని ఆహ్వానించుదును…
నా దగ్గర ఒక వెచ్చటి రగ్గు ఉంటే
నేనూ చలిని సరదాగా సవాల్ చేద్దును…
వణుకుతున్న నా హృదయానికి దగ్గరగా
ఒక వెచ్చని హృదయం ఉంటే
నేనూ చలిని ప్రేమించుదును…!

ఈ ప్రపంచం ఎంత మాయలమారిదంటే
అయ్యో అంటుంది
అయ్యయ్యో అంటుంది గానీ
అసలేదీ చెయ్యదు…
పైకి ప్రపంచం చెప్పదు గానీ
తల్లడిల్లే వాణ్ణి చూసి తడి తగలదు దానికి…
ఓర్వలేనితనంతో ఒకడి యాతనకు లోలోపల రహస్యంగా ఆనందించే పైశాచికం దాని గుణం…
ఒకడి ఓటమిని ఉత్సవం చేసుకునేందుకు ఎదురు చూస్తుందది
అయినా ఎప్పుడూ ఒకరిని వెంటాడటమే వేటాడటమే కదా
ఈ గొప్ప ప్రపంచపు నీతీ నిజాయితీ!

జీవితం పొడవునా
ప్రశాంతతను దోచుకునే చలి గాలుల తంత్రాలే వీచి వీచి
తనువును మనసును కరచి కరచి బోలెడు మచ్చలను ఇచ్చి
ఎగతాళిగా చూసి దొంగ సానుభూతి ఒలికించినపుడు ఎంత నరక యాతన…
నిస్సహాయత తెచ్చే దుఃఖం
ఎంత గొప్ప కలలనైనా కాల్చుకు తినేస్తుంది…
మనుషుల్ని వాళ్ళ అబద్ధాల్ని నటనల్ని ఇంకెన్నడూ నమ్మలేని ఈ పిచ్చితనం ఈ పేదరికం
చెలినీ రానివ్వదు చలినీ పోనివ్వదు!
ఏదో మిస్సింగ్ ఈ ప్రపంచంలో…
అదే వెతుకుతున్నాను యుగ యుగాలుగా!!

– జి. కళావతి

*(చలించి మతి చలించి చలిలో వణుకుతూ అర్థనగ్న దేహంతో తిండీ నీళ్ళూ కూడా పట్టని స్థితిలో శూన్యమైన చూపులతో ప్రశ్నల్ని రోడ్ల మీద పారేసుకుంటూ ఏదో వెతుక్కుంటూ తాత్వికుడిలా సంచరిస్తున్న ఓ యువకుడిని చూసి… ఆ మౌన దృక్కుల మనోభావాలను చదివే ప్రయత్నం చేసి…)

Leave A Reply

Your email address will not be published.

Breaking