Take a fresh look at your lifestyle.

నిస్వార్థ సమర యోధుడు.. గోపాలకృష్ణ గోఖలే !

0 18

నిస్వార్థ సమర యోధుడు..గోపాలకృష్ణ గోఖలే !

దేశం కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమాలకి ఊపిరి పోసిన ఎందరో సమరయోధుల్లో గోపాల కృష్ణ గోఖలే ఒకరు. నేటి తరంలో చాలామంది ఈ పేరు కూడా విని ఉండరు. కానీ, ఆయన నాయకత్వ పటిమ గురించి ఒక్కసారి చదివితే ఖచ్చితంగా మర్చిపోరు. జాతిపితగా నేటికీ అందరి మన్ననలు పొందుతున్న మహాత్మ గాంధీజీ గోఖలేని తన గురువుగా అభివర్ణించారంటే గోఖలే వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు..

మే9 మహానుభావుడి జన్మదినం సందర్భంగా ఆయన గురించి చరిత్ర చెప్పిన కొన్ని నిజాలు తెలుసుకుందాం..1866 మే 9వ తేదీన ఓ సాధారణ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారు గోఖలే. ఆయన స్వగ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా గుహాగర్‌ తాలూకా కొట్లాక్‌ గ్రామం. ఆస్థిపాస్తులు పెద్దగా లేకపోయినా అప్పట్లోనే గోఖలేకి ఆంగ్ల విద్యని చెప్పించారు ఆయన తల్లితండ్రులు.

దేశంలో మొట్టమొదట ఆంగ్ల విద్యని అభ్యసించిన భారతీయుల్లో గోఖలే ఒకరు. ఆయన చదువుల్లో రాణించి ఆంగ్ల భాషపై పట్టు సంపాదించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వ ఉద్యోగిగా నియమితు డయ్యాడు. నేర్చుకున్న విద్య ఆయన ఆలోచనల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. రాజకీయాలలో పాల్గొనటానికి నమ్మకస్తుడైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న జస్టిస్‌ మహాదేవ్‌ రానడేకి గోఖలే పరిచయమయ్యాడు. గోఖలేకి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి, పట్టుదల గమనించిన రానడే గోఖలేని శిష్యుడిగా చేసుకున్నాడు.

రానడే స్థాపించిన ’పూనా సార్వజనిక్‌’ సభ నిర్వహించే పత్రికా సంపాదకుడిగా గోఖలేకి బాధ్యతలు అప్పగించి చిన్న వయసులోనే రాజకీయ జీవితానికి నాంది పలికారు. విద్య ద్వారానే భారతీయులు అభివృద్ధి చెందగలరని అభిప్రాయపడి జనాలను చైతన్యపరచడం మొదలు పెట్టాడు. 1904లో నౌరోజీ పిలుపునిచ్చిన స్వపరిపాలనకు మద్దతుగా గోఖలే తన గొంతు కలిపాడు. వాడవాడలా తిరుగుతూ తన ఉపన్యాసాలతో ప్రజలను చైతన్య వంతులుగా చేశాడు. నౌరోజీ విదేశాలకు వెళ్ళి అక్కడి ప్రభుత్వాలకు భారతదేశ గోడు వినిపించేలా చేసేవాడు. దేశంలో గోఖలే, విదేశాల్లో నౌరోజీ ఎంతో కృషి చేసి, సభలు జరిగిన ప్రతులను ప్రభుత్వానికి అందేలా చేసేవారు.

వీరి ఇరువురి వాణి విద్యావంతుల్ని ప్రభావితం చేసింది కానీ, చదువులేని వారికి చేరేది కాదు. బ్రిటీష్‌ ప్రభుత్వ కవిూషన్‌లో మాట్లాడే అర్హత సంపాదించుకున్నాడు.

ఒక గొప్ప సామాజిక, సాంఘిక, రాజకీయవేత్తగా ఆయన పోరాడి, చివరికి ఆయన జీవితం రాజకీయ చదరంగంలోనే ముగిసింది. 1915వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న గోఖలే తన తుదిశ్వాస విడిచారు. దేశం కోసం ధైర్యంగా, నిజాయితీగా ముందడుగు వేసిన మహానుభావుడిని స్మరించుకోవడం భారతీయులుగా మన కనీస ధర్మం.

– ఆర్ ఎన్ ఎ సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking