Take a fresh look at your lifestyle.

“చంద్రునితో సెల్ఫీ దిగుతా” కవిత్వం

0 15

“చంద్రునితో సెల్ఫీ దిగుతా”

నాకు ఎగరాలని వుంది!!…
ఉప్పొంగిన హృదయంతో
ఓ కొత్త వాస్తవ గ్రంథాన్ని తెరవాలనిఉంది…
మన అందరి మేనమామ చందమామతో…

ఆ ఆకాశంలోకి ఉరకాలని!!…
వెన్నెలను బంధించిన మేఘాలను నుండి…
బంధవిముక్తి కలిగించాలని ఉంది!!…
స్వేచ్ఛగా తిరగాలని…
సమస్త ప్రాణకోటిని పైనుండి చూడాలని ఉంది!!..
ఆ గగనవీధుల్లో నడవాలని
ఆ చల్లని వెన్నెల అలలను తాకాలని ఉంది…
ఆ లోకమంతా చుట్టిరావాలని…
ఆ లోకం పోకడ తెలుసుకోవాలనివుంది
అంతులేని అందాల అంతు చూడాలని…
ఈ మానవ సమూహానికి అందించాలని
ఆ ఉగ్రరూపం కళ్లారా చూడాలని ఉంది.

రోజుల తరబడి రాస్తూనే ఉన్నా…
కవిత్వముతో గుండెను
నిత్యం తడుపుతూనే ఉన్నా!!…
స్వేచ్చగా తిరిగే రెక్కలు మొలవలేదు…
నా కోరికల దాహం తీరనూ లేదు…
నిరంతరం ఓ నిజాన్ని రాస్తూనే ఉన్నా!!
ఆకాశానికి ఎగిరే రెక్కలు వస్తాయని!!…
అనాదిగా ఈ అవనిపై ఎగురుతూనే ఉన్నా…

ఇప్పుడు ఓ చైతన్య స్ఫూర్తిని అందించారు…
ముందు ముందు చంద్రయాన్ అనే
ఓ కొత్తలోకానికి వెళ్ళబోవుచున్నాం…
భారతీయ శాస్త్రవేత్తలు
పురివిప్పిన ఖ్యాతికి పురుడుపోశారు!!
ఓ అద్భుత చరిత్రకు నాంది పలికారు!!

పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి…
చిన్న చిన్న పిట్టలు స్వేచ్చగా తిరుగుతున్నాయి…
నా మనసులో తపన పెరుగుతోంది..
నక్షత్రల్లాగా మెరవాలని…
వీచే గాలినై అందరినీ స్పృశించాలని..
కొమ్మకొమ్మకో సన్నాయిగా
మారాలని ఉంది…

అనంత శూన్యం అంచులను తాకాలని
అచంచలమైన భావాలతో చుట్టుకోవాలని వుంది…
ఆత్మకు అంతరాత్మకు ముడివేసి..
పాత్రకు పాత్రధారులకు
సూత్రాలను నేర్పించాలని ఉంది!!…
ఊహించని కలలు వెంటబెట్టుకొని
ఉవ్వెత్తున ఎగిరిపోవాలని ఉంది…
అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు
విశ్వంలో సువిశాల భారత
జెండాను ఎగరేశారు!!…
నింగికి నేలకు నిచ్చెన వేశారు
రేపటికి ఓ కొత్త దారి నిర్మిస్తారు

ఇప్పుడు చుక్కలన్నీ తెంపుకుంటా!!
చంద్రునితో సెల్ఫీ దిగుతా!!
ఎగురుతున్న పిట్టలను
ఓర్పుతో నేర్పుతో పట్టుకుంటా!!
ఆకాశవీధుల్లో కనబడే
మన జెండాకు సాల్యూట్ చేస్తా!!..
వ్యక్తులను కలుసుకుంటా
కావలిసిన వ్యక్తులను కలుపుకుంటా
మన శాస్త్రవేత్తలకు తలవంచి నమస్కారంచేస్తాను

– అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Leave A Reply

Your email address will not be published.

Breaking