Take a fresh look at your lifestyle.

రాహుల్ క్షమాపణ చెప్పాలి : బిజెపి

0 169

రాహుల్ క్షమాపణ చెప్పాలి బిజెపి …చెప్పే ప్రసక్తే లేదు కాంగ్రెస్
తాను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ మార్చ్ 16 :కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటుకు హాజరయ్యారు. ఆయన లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘భారత దేశానికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడలేదు. వాళ్లు అవకాశం ఇస్తే పార్లమెంటులో నేను మాట్లాడతాను’’ అని చెప్పారు.
రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేదని, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు. భారత దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ ఆరెస్సెస్ చొచ్చుకెళ్లాయన్నారు.
క్షమాపణ చెప్పేది లేదు : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చాలాసార్లు విదేశాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పబోరని, అటువంటి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదానీ అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు ఆదేశించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దానిని తప్పించుకునేందుకు పార్లమెంటును సజావుగా జరగనివ్వకూడదని అధికార పక్షం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
వారందరిదీ ఒకే మాట : కిరణ్ రిజిజు
దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒకే విధంగా ప్రవర్తిస్తాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను రిజిజు ప్రస్తావించారు. దేశంలో, వెలుపల ఉన్న దేశ వ్యతిరేకులు మాట్లాడే మాటలనే రాహుల్ మాట్లాడారని చెప్పారు. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ గడ్డపై భారత దేశాన్ని కించపరచిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking