Take a fresh look at your lifestyle.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన విజయవంతం

0 70

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన విజయవంతం

:  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన విజయవంతం అయినందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు లబ్ధిచేకూర్చే ప్రాజెక్టుల ప్రారంభం, భూమిపూజ జరిగిందని.. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని.. ఇప్పుడు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ను ప్రారంభించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రజల సౌకర్యార్థం 100 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లను ప్రారంభింస్తామని ప్రధాని ఇదివరకే చెప్పారన్న కిషన్ రెడ్డి.. ఈ విషయం తెలియక తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

ప్రధాని కార్యక్రమం సందర్భంగా చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కోసం కుర్చీ వేసి పెట్టామని.. మోదీ గారు వేదికపైకి వచ్చాకే, కేసీఆర్ రాని కారణంగా ఆ కుర్చీని తొలగించాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో మంత్రులందరూ జీరోయేనని, ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే చదువుతారని కిషన్ రెడ్డి అన్నారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడారంటూ తెలంగాణ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. ఎవరిపేరు తీసుకోకుండా.. ప్రధానమంత్రి.. అవకాశవాద, వారసత్వ రాజకీయాల ద్వారా జరుగుతున్ననష్టాన్ని మాత్రమే ప్రజలకు గుర్తుచేశారన్నారు. గతంలో ఎర్రకోట వేదిక ద్వారా కూడా.. దేశంలో అవినీతిని, వారసత్వ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలని మోదీ గారు పిలుపుఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రారని, ప్రజలను కలవరి.. ఇంతకుమించి వేరేపని కేసీఆర్ కు ఏముందో ప్రజలకు తెలపాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, భూమిపూజకు రానంత ముఖ్యమైన పని సీఎంకు ఏముందని ఆయన అడిగారు.

గతంలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంలోనూ ప్రధానమంత్రి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాని విషయాన్నికేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎన్ని కార్యక్రమాలున్నా.. తెలంగాణపై ఉన్న అభిమానంతో ప్రధాని ఇవాళ హైదరాబాద్ కు వచ్చారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణను ఎలా దోపిడీ చేయాలి, కొడుకును ముఖ్యమంత్రిని ఎలా చేయాలనేదే కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు.

బాధ్యతారహితంగా వ్యవహరించిన కేసీఆర్ తెలంగాన ప్రజలకు క్షమాపణచెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రికి కేసీఆర్ తో వైరం లేదని, తెలంగాణ ప్రజలతోనే కేసీఆర్ కు వైరం ఉందన్నారు. తాము ప్రొటోకాల్ పాటించామని.. ముఖ్యమంత్రే దాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు.

సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తనకు పాత పరిచయం అని.. అసెంబ్లీలో ఉన్న సమయంలో ఆత్మీయంగా పలకరించుకునేవారమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నియోజకవర్గ పనుల కోసం కలిసేవారమన్నారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నాయకుడిగా.. ఓ బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking