Take a fresh look at your lifestyle.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

0 275

మార్చి 31 నాటికి కల్యాణ వేదిక సహా బ్రహ్మోత్సవాల పనులన్నీ పూర్తి చేయాలి

– ఏప్రిల్ 1 నుండి కల్యాణ వేదిక ఆవరణంలో రిహార్సల్స్

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం

తిరుపతి, మార్చి 24 : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వీర బ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మార్చి 31నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మతో కలిసి జేఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు ఆయా ఇన్చార్జులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు, వసతి, తలంబ్రాల తయారీ, అన్నప్రసాదాలపంపిణీ, పారిశుద్ధ్యం, రవాణా ఇంజనీరింగ్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు.

ఏప్రిల్ 5వ తేదీన జరిగే శ్రీ కోదండరామ స్వామివారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన చెప్పారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని, విఐపిలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, స్వామివారి తలంబ్రాలు, పసుపు, కుంకుమ ఉండే బ్యాగులు ఒక పద్ధతి ప్రకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేకించి కల్యాణ వేదిక వద్ద విద్యుత్, పుష్పాలంకరణలు, ఎల్ఈడీలు, బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం, విఐపిలు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయంతో పని చేయాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల చిన్నపాటి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

జిల్లా అధికారులు తమ బృందంలోని టీటీడీ అధికారులతో నిత్యం సమన్వయంతో ఉంటూ వారికి అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పండుగగా జరుపుతున్న శ్రీ కోదండరామ స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు,స్వామివారి కల్యాణం ఏర్పాట్లపై రోజు వారి ప్రగతి తమకు తెలియజేయాలని ఆదేశించారు.

ఎస్వీబీసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, టీటీడీ సిఈ నాగేశ్వరరావు, జిల్లా అదనపు ఎస్ పి తుషార్, ఆర్డీవో
ధర్మ చంద్రారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, డిఎం హెచ్ వో డాక్టర్ నాగరాజు తో పాటు టీటీడీ లోని వివిధ విభాగాధిపతులు సమీక్షలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking