Take a fresh look at your lifestyle.

దరఖాస్తు ఒక్కటి.. సాయం ‘గ్యారంటీ’

0 12

దరఖాస్తు ఒక్కటి.. సాయం ‘గ్యారంటీ’

  • తెలంగాణ ప్రజలకు ‘అభయహస్తం’
  • ‘ప్రజాపాలన దరఖాస్తు’ ఆవిష్కరణ
  • గ్యారంటీ హామీల అమలుకు శ్రీకారం
  • రేపటి నుంచే స్వీకరణ షురూ..
  • ప్రజల్లో ఆనందోత్సాహాలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రేవంత్‌ రెడ్డి సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారంటీల అమలు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు.. సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ‘ప్రజాపాలన దరఖాస్తు’లను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.   పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలపై కోటి ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే దరఖాస్తు.

తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్‌ ఫారం  సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాలలో.. కుటుంబ యజమాని పేరుతో మొదలై.. పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డు నంబర్‌, రేషన్‌ కార్డు నంబర్‌, మొబైల్‌ నెంబర్‌, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది.

రేపటి నుంచే..

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాలను సిద్ధం చేసింది. మహాలక్ష్మీ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మిగతా గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.

మహాలక్ష్మి పథకం..

ఒక్క దరఖాస్తులోనే  గ్యారంటీ పథకాలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్‌ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయం అనే కాలమ్‌ ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు.. పక్కన ఉన్న బాక్స్‌లో టిక్‌ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ రూ. 500లకు గ్యాస్‌ సిలిండర్‌ ఆప్షన్‌ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్లు ఇక్కడి టిక్‌ చేయడంతోపాటు గ్యాస్‌ కనెక్షన్‌ నంబర్‌, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.

రైతు భరోసా..

ఇక రైతు భరోసా పథకం పొందాలనుకునే వాళ్లు ఇందులో పలు కాలమ్‌లను టిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో రైతు, కౌలు రైతు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు నమోదు చేయాలి. ఇక ఏటా రూ. 12000 కావాలనుకునే వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్డు నెంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్లు..

ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కావాలనుకునే వారు కూడా ఈ దరఖాస్తులోనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అమరవీరులు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన కాలమ్‌ కూడా ఉంది. అయితే అమరవీరులు, ఉద్యమకారులకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు కూడా ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.

గృహజ్యోతి:

గృహజ్యోతి పథకం కింది నెలకు ఉచిత విద్యుత్‌ కావాలనుకునే వాళ్లు ఇందులో ఉన్న కాలమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వారి గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ సంఖ్యను తెలిపాల్సి ఉంటుంది.

చేయూత..

చేయూత పథకం కింద నెలకు రూ. 4,000 కావాలనుకునే వారు, రూ. 6000 పొందాలనుకునే దివ్యాంగులు కూడా చేయూత పథకం కింద ఉండే కాలమ్‌లలో వివరాలు నమోదు చేయాలి. ఇందులో అనేక ఆప్షన్లు ఇచ్చారు. లబ్ధిదారులు ఏ కోటాలో చేయూత పథకం పొందాలనే అంశాన్ని తెలియజేయాలి. ఇప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఏయే పత్రాలు కావాలి?..

ఇక ఈ దరఖాస్తులో వివరాలు పొందుపర్చిన వారంతా దీనికి ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌తో పాటు తెల్లరేషన్‌ కార్డ్‌ ప్రతిని జతచేయాలి. ఈ దరఖాస్తును తీసుకునే అధికారులు.. ఇందుకు సంబంధించిన రశీదును కూడా అందిస్తారు.

  • వయ్యామ్యెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking