Take a fresh look at your lifestyle.

చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా..

0 538

ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘నాటునాటు’
బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డు ప్రకటన

న్యూయార్క్, మార్చి 13 : తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం  ఆర్ఆర్ఆర్.  95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది.

ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలో ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలో ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్, రామ్చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్రక్షిత్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఆవార్డులు సాధించింది.

అయితే తాజాగా ఆస్కార్ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్ ఇప్పటికే.. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్గ్లోబ్ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహాన్నా పాడిన లిఫ్ట్ మి అప్, టేలర్ స్విఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది.

మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా.. ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ అందుకుంది. కరోలినా, సియావో పపా, హోల్డ్ మై హ్యాండ్ పాటలతో నాటు నాటు పోటీపడింది. ట్రిపుల్ ఆర్ సినిమా 24 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్కు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. తెలుగు సినిమా పాట ఆస్కార్కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి
================

Leave A Reply

Your email address will not be published.

Breaking