భారత్ పురోగతి అద్భుతం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు
ఢిల్లీ లో ప్రధాని మోదీతో భేటీ తర్వాత వెల్లడి
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. వివిధ రంగాల్లో మహత్తరమైన పురోగతిని సాధిస్తోందని, నూతన ఆవిష్కరణలపై పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో ఈ దేశం నిరూపించిందని కొనియాడారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న బిల్‌గేట్స్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ఆ భేటీ గురించి గేట్స్ తన అధికారిక బ్లాగ్ ‘గేట్స్ నోట్స్’లో రాసుకొస్తూ.. భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ‘ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో.. భారత్ లాంటి ఓ సృజనాత్మక, డైనమిక్ దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోంది. భారత్.. సమర్థమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో ఉండే టీకాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసింది.
ఆ టీకాలు కరోనా సమయంలో లక్షల మంది ప్రాణాలను కాపాడటమే గాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాధుల వ్యాప్తిని కూడా నివారించాయి. వ్యాక్సిన్లను ఇతర దేశాలకూ అందించి స్నేహబంధాన్ని చాటుకుంది. కొవిన్ యాప్.. ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వసించారు. దాన్ని నేనూ అంగీకరిస్తున్నా’నని గేట్స్ కొనియాడారు.
ఈ సందర్భంగా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ టెక్నాలజీ గురించి బిల్‌గేట్స్ ప్రస్తావించారు. సాంకేతికతతో ప్రభుత్వం పనితీరు మెరుగవుతుందని చెప్పేందుకు గతిశక్తి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు. ‘‘ప్రధానితో మాట్లాడిన తర్వాత.. ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్ సాధిస్తోన్న పురోగతి గురించి గతంలో కంటే మరింత ఆశావహ దృక్పథంతో ఉన్నా. మనం సృజనాత్మక రంగంలో పెట్టుబడులు పెడితే ఏం సాధించగలమో భారత్ నిరూపిస్తోంది. ఈ పురోగతి ఇలాగే కొనసాగాలని, భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నా’’ అంటూ గేట్స్ తన బ్లాగ్‌ను ముగించారు.