తెలంగాణ గురు’కులాలు’
ఇండియాలో పుట్టిన వాడికి కులం తప్పదు.. మరణించి మళ్లీ పుట్టినా, కులం అంటక తప్పదు. అనివార్యమగు ఈ సంఘటనల గూర్చి శోకించతగదు.
నిర్దేశం, హైదరాబాద్ః గురుకులాలు తెలంగాణలో చాలా ఫేమస్. నిన్నటి వరకు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విద్యార్థుల వసతి గృహాలని చాలా మందికి తెలుసు. కానీ, నేడు బయటి సమాజంలో కులోన్మాదంతో పోటీ పడే పాఠశాలలు అనాలేమో. చదువు చెప్పే గురువులే కులోన్మాదం చూపిస్తున్నారు.. బహుశా అందుకేనేమో.. వాటిని గురు’కులాలు’ అన్నారు. నిజానికి ఇది ఈరోజు కొత్తగా వచ్చిందనుకుంటే ఉప్పులో కాలేసినట్టే. గురువుల నుంచే ఈ కులోన్మాదం ప్రభలంగా ఉంటుంది. అందుకే ఈ దేశంలోని 90% ప్రజలు (ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలుగా పిలువబడుతున్న ప్రజలు) కొన్ని వందల ఏళ్లుగా చదువుకు దూరమయ్యారు. నేటికీ విద్యాలయాల్లో కులం ఇంకా బతికే ఉంది కాబట్టే.. విద్యకు నాణ్యత అంటడం లేదు.
మారుతున్న కాలానికి పరిస్థితులు మారుతుంటాయి. కానీ, ఈ దేశంలో అన్నీ మారుతాయి కానీ, కులం మారదు. కాకపోతే, గతంలోలాగ నేరుగా కనిపించదు, మందులకు లొంగకుండా తన రూపాన్ని మార్చుకునే వైరస్ లా కులం కూడా కొత్త పుంతలు తొక్కుతుంటుంది. అందుకే నేటికీ.. రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అయినా కూడా కులం కారణంగా అవమానాలు ఎదుర్కోవడం ఈ దేశంలో సర్వసాధారణ విషయం. భగవద్గీతలో ఓ శ్లోకాన్ని మార్చి చెప్పితే.. ఇండియాలో పుట్టిన వాడికి కులం తప్పదు.. మరణించి మళ్లీ పుట్టినా, కులం అంటక తప్పదు. అనివార్యమగు ఈ సంఘటనల గూర్చి శోకించతగదు.
సరే విషయంలోకి వద్దాం.. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చదువు చెప్పడం లేదని, తిండి పెట్టడం లేదని రోడ్డెక్కుతున్నారు. అమ్మాయిలైతే లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వీటికి తోడు తమపై గురువుల కులోన్మాద బూతు పురాణాలనూ వెల్లడిస్తున్నారు. నిజానికి.. ప్రాథమిక విద్యా దశలో ఉన్న విద్యార్థులకు కులంపై అంత అవగాహన ఉండదు. అయినా వారు కన్నీళ్లు పెడుతున్నారంటే.. కుల రక్కసి ఎంత విపరీతంగా ఉందో విప్పి చెప్పనవసరం లేదు. ‘ల’ కారాలు, ‘మ’ కారాలు.. ఇలా తెలుగు భాషలో ఉన్న బూతుపురాణాలు విద్యార్థులపై ప్రయోగిస్తున్నారు. తమను ఏమేమి తిడుతున్నారో మీడియాకు విద్యార్థులే స్వయంగా వెల్లడిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయినా ఇదంత పెద్ద ఇష్యూ కాదులే. పాలకులు, అధికారులు.. కులహంకారాన్ని నెత్తిన మోసే వారే కావున.. వీటిని గురుకులాల అన్నంలో పోసిన చారుకంటే పలుసన చేసేందుకు వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు. సమస్య మరీ తీవ్రమైతే.. ఓ నాలుగు రోజులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారు. అదేంటో విచిత్రం.. విద్యార్థుల మెనూ కార్డులో ఉన్న దేనినీ పట్టించుకోరు. కానీ, ఏదైతే వద్దని రాజ్యాంగంలో రాసుకున్నామో.. దాన్ని కొసరి కొసరి మరీ వడ్డిస్తుంటారు. అది కులమైతే మరీనూ. గోదావరి జిల్లాలో కొత్త అల్లుడికి కూడా దక్కనంత మర్యాదలో అందుతుంది. కానీ, చదువు కొనలేని పేద పిల్లలు.. చదువుకొవాలంటే పురుగుల అన్నంతో పాటు, పరువును కోల్పోయే కులాన్ని కూడా భరించాల్సిందే.
– టోనీ బెక్కల్