Take a fresh look at your lifestyle.

వివేకా హత్యకు ఫ్యామిలీ గొడవలే కారణమా..?

0 50

వివేకా హత్యకు ఫ్యామిలీ గొడవలే కారణమా..?

హైదరాబాద్, ఫిబ్రవరి 23, మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు సునీల్ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ.. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకాను సునీల్ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడన్న సీబీఐ…

హత్య జరిగిన రాత్రి సునీల్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని.. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని వివరించింది.ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరినట్లు సీబీఐ వెల్లడించింది.

వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని… శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. సాక్ష్యాల ప్రకారం శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌ కుట్రపన్నినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారన్న సీబీఐ..

వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాష్‌రెడ్డి స్థానిక సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపింది.అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వివేకా హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందన్న సీబీఐ…. కుట్రలో భాగంగానే గుండె, రక్తవిరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోందని పేర్కొంది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని సీబీఐ అధికారులు తెలిపారు. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని వెల్లడించారు.

బాబాయ్ హత్య కేసులో అబ్బాయ్ విచారణ
మాజీ ఎంపీగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కావడంతో వివేకా హత్య కేసు అధికార, విపక్షాల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కేంద్ర స్థానంగా ఉంటోంది. అందులోనూ ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మరోసారి సీబీఐ విచారణకు పిలుస్తుండడంతో దీని ప్రాధాన్యం ఇంకా పెరిగింది.అవినాష్‌ రెడ్డిని తొలుత 2023 జనవరి 28న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. విచారణకు తాను సహకరించినట్టు ఆయన మీడియాకు తెలిపారు.

అయినా నెల తిరగకుండానే మరోసారి ఫిబ్రవరి 24న విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు అందాయి. ఈసారి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమయ్యింది. తండ్రీ, కొడుకులిద్దరినీ ఒక్కరోజు వ్యవధిలో సీబీఐ విచారిస్తోంది.హైకోర్టు ఆదేశాల మేరకు 2020 మార్చి 11న ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 వరకూ 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. వాటి ఆధారంగానే అవినాష్‌ రెడ్డిని రెండోసారి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మొదటిసారి విచారిస్తోంది.

జగన్, భారతి అనుచరులను కూడా…
హత్య జరిగిన రోజు తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన భార్య భారతితో మాట్లాడినట్టు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణలో వెల్లడయ్యిందని మీడియాలోకథనాలు వచ్చాయి. భారతి దగ్గర పనిచేసే నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా భారతితోనూ, ప్రస్తుతం సీఎంవోలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఫోన్‌లో జగన్‌తోనూ మాట్లాడినట్టు అవినాష్ రెడ్డి తెలపడంతో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నుంచి కూడా సీబీఐ వివరాలు సేకరించింది. 2023 ఫిబ్రవరి 3న కడపలో వారిద్దరినీ సీబీఐ విచారించింది. ఐదు గంటల పాటు వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.హత్య జరిగిన రోజు తెల్లవారు జామున 3గం.ల సమయంలో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నెంబర్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్టు కాల్ డేటా చెబుతుండటంతో సీబీఐ వారివురిని ప్రశ్నించింది. పలుమార్లు వారి ఫోన్‌కి కాల్ చేసినట్టు తేలడంతో వారి నుంచి సమాచారం తీసుకున్నారు.జగన్ సీఎం కాక ముందు నుంచీ ఆయనకు సన్నిహితుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతి ఇంట్లో పనిచేస్తున్న నవీన్ కూడా సీబీఐ విచారించడంతో ఈ కేసు విచారణ వేగవంతమయినట్టు కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిని తొలిసారి విచారించిన తర్వాత సీఎంవోలో ఉన్న వారికి సైతం నోటీసులు వెళ్లడం, విచారణ జరపడంతో వారి నుంచి సేకరించిన సమాచారంతో అవినాష్ రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ఎలాంటి చర్యలుంటాయన్నది చూడాల్సి ఉంది.

అవినాష్ రెడ్డిపై సునీత ఆరోపణలతోనే మొదలు
వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె డాక్టర్ నర్రా సునీత మొదటి నుంచి నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు.ఆ తర్వాత ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో జాప్యం జరుగుతుండడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకి వెళ్లారు. విచారణ సజావుగా సాగడం లేదంటూ కేసుని ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు. చివరకు 2022 నవంబర్ 22న కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణపై మృతుడి కుమార్తె, భార్య అనుమానాల నేపథ్యంలో బదిలీకి అనుమతిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలని కోరుతూ డాక్టర్ సునీత నేరుగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో కేసు విచారణ హైదరాబాద్ కోర్టులో సాగుతుండగా, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు జారీ కావడం, విచారణ జరగడం కీలక పరిణామంగా మారింది.

సీబీఐ ఎందుకొచ్చింది?
2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. 15న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో మృతుడి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నెం. 84/2019 గా పులివెందుల పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.అదే నెల 28న ఈ కేసులో ఎం.వి. క్రిష్ణా రెడ్డితోపాటు యెర్ర గంగిరెడ్డి, ప్రకాష్ అనే వారిని సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో పోలీసులు అరెస్టు చేసి, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.“నిందితులు వివేకా మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూమ్‌కు తరలించారు. బెడ్ రూంలోని రక్తపు ఆనవాళ్లను తుడిచేసి, సాక్ష్యాలను తారుమారు చేశారు.

పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టకముందే, వివేకా శవాన్ని అంబులెన్స్‌లో పులివెందుల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి మార్చారు. వివేకా, తన మరణ కారణాన్ని తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని ఆయన పీఏ క్రిష్ణా రెడ్డి దాచిపెట్టి, మరణ కారణం తెలిసి కూడా, తెలియదు అంటూ ఫిర్యాదు చేశాడు’’ అని పోలీసులు చెప్పారు.హత్య జరిగిన రోజు తొలుత గుండెపోటు అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రకటించినప్పటికీ తదుపరి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దానిని హత్యగా ధ్రువీకరించారు. కానీ విచారణ మాత్రం సజావుగా సాగడం లేదంటూ 2020 ఫిబ్రవరిలో హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్. సునీతా రెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి సి.ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు.కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది.వివేకా ఉదంతం వెలుగులోకి రాగానే 2019 మార్చి 15న నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ ను నియమించింది. అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పడింది. కానీ 2019 జూన్ 13న ఆర్సీ నెం.266/L&O-III/2019 ప్రకారం ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు ఇన్ స్పెక్టర్లతో పాటుగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో కడప ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతీ నేతృత్వంలో విచారణ జరుగుతుందన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి ‘సిట్’ దర్యాప్తు కొనసాగించింది. 2020 ఫిబ్రవరి వరకూ దశల వారీగా విచారణ సాగింది. సుమారుగా 1,300 మంది సాక్షులను విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో టెస్టులు చేశారు. విచారణకు హాజరైన వారిలో వై.ఎస్. కుటుంబ సభ్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలోఉన్న సి.ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవితోపాటుగా వివేకాకు చికిత్స చేసిన సన్ రైజ్ ఆస్పత్రి వైద్యులు కూడా ఉన్నారు.అడిషనల్ డీజీ స్థాయి అధికారి స్థానంలో ఎస్పీగా ఉన్న అధికారి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కాగా, కొద్దికాలానికే మహంతి తొలుత సెలవులో వెళ్లి, తర్వాత తెలంగాణ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తదుపరి కడప ఎస్పీగా ఉన్న కే కే అన్బురాజన్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని తొలుత ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో పిటీషన్ వేసిన జగన్, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 జనవరిలో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

సాక్షుల మృతి, అప్రూవర్‌గా దస్తగిరి

ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న కే శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న మరణించారు. ఆయన హఠాన్మరణం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసులో నిందితుడైన పరమేశ్వర్ రెడ్డికి మృతుడు శ్రీనివాసరెడ్డి తోడల్లుడు.
2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి కూడా మరణించారు. ఈ కేసులో తనను సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఆరోపించిన పది రోజులకే ఆయన చనిపోయారు.వివేకా హత్య తర్వాత తొలుత అక్కడికి వెళ్లిన వైద్యులు సన్ రైజ్ ఆసుపత్రికి చెందిన వారు. కాగా ఆ ఆసుపత్రి వైఎస్ జగన్ భార్య భారతి తండ్రి డాక్టర్ ఈసీ గండిరెడ్డిది. ఆయన 2020 మార్చి 3న మరణించారు.ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అఫ్రూవర్ గా మారారు. 2021 ఆగస్ట్ 31న ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాంగ్మూలం ఇచ్చారు.వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేమిటి? హత్యకు పథక రచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎలా హత్య చేశారు? హత్య అనంతరం “కేసును తప్పుదారి పట్టించేందుకు” ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా వెలుగులోకి వచ్చిన ఆయన వాంగ్మూలం పత్రాల్లో ఉంది. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.”2019 ఫిబ్రవరి 10న సునీల్ యాదవ్ నన్ను గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి నాతో.. ‘బెంగళూరు భూమి సెటిల్మెంట్ విషయంలో వివేకానందరెడ్డికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. వివేకాను నువ్వు చంపేయ్’ అని తనతో చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలంలో ఉంది.అయితే, నేను ఆయన్ను చంపలేనని చెప్పాను. కానీ.. ‘నువ్వొక్కడివే కాదు, నీతో మేమూ వస్తాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడు. అందులో నీకు రూ. 5 కోట్లు ఇస్తాం’ అని గంగిరెడ్డి చెప్పారు. ఆ తరువాత సునీల్ యాదవ్ ద్వారా నాకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అందులో రూ. 25 లక్షలు సునీల్ మళ్లీ ఇస్తానని తీసుకున్నాడు. మిగతా 75 లక్షలు నా స్నేహితుడి దగ్గరు ఉంచాను. ఆ డబ్బులు ఉంచినందుకు ఆయనకు రూ. 5 లక్షలు కమీషన్ ఇస్తానన్నాను” అంటూ దస్తగిరి కోర్టుకి, సీబీఐకి తెలిపారు.

సీబీఐ చార్జ్ షీట్‌లో కీలకాంశాలు

సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చింది. అంతేగాకుండా అనేక ఆరోపణలు కూడా చేసింది. సుపారీ తీసుకుని హత్య చేయడం, ఆ తర్వాత ఆధారాలు చెరిపివేయడం సహా అంతా పెద్ద కుట్ర అంటూ పేర్కొంది. అంతేగాకుండా కడప ఎంపీ సీటు విషయంలోనే వివాదం అంటూ కూడా సీబీఐ ఛార్జ్ షీట్ పేజ్ నెం. 14లో ప్రస్తావించింది.నేరుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తో పాటుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శంకర్ రెడ్డి మీద కూడా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్ట్ కి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో వీటిని పేర్కొంది.వివేకా కుటుంబీకుల ఆరోపణలు, సీబీఐ ప్రస్తావించిన అంశాలతో పాటుగా కొనసాగుతున్న విచారణలో లభించిన ఆధారాలతో తదుపరి చర్యలకు పూనుకునే అవకాశం ఉంటుంది. అయితే సీబీఐ ఏమేరకు ఈ కేసులో ఆధారాలు సేకరించగలుగుతుంది, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలకు పూనుకుంటుందన్నది కీలకం. ఇప్పటికే నాలుగేళ్లుగా నానుతున్న కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్న దానిని బట్టి ఇది రాజకీయంగానూ ప్రభావం చూపుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking