Take a fresh look at your lifestyle.

పెంపుడు కుక్క వివాదం.. కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

0 56

పెంపుడు కుక్క వివాదం..

– కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

నిర్దేశం, హైదరాబాద్

ఇంట్లో కుక్కను పెంచుకోవడం ఫ్యాషన్.. కానీ.. ఆ పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగిలాయి. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్ నగర్ నివాసి మధు కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు.

 ఈనెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలు దేరారు. ఆ సమయంలో పెంపుడు కుక్క కూడా వీరితో పాటు బయటకు వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతికారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు.

మంగళవారం సాయంత్రం మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రాణంలా చూసుకునే కుక్కను ధనుంజయ్ కొడుతుంటే.. శ్రీనాథ్, అతడి కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు.

దీంతో మరింత రెచ్చిపోయిన ధనుంజయ్ తో సహా ఐదుగురు వ్యక్తులు మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మధు సోదరుడు శ్రీనాథ్ తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్నను కూడా ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. దెబ్బలతో కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking