Take a fresh look at your lifestyle.

లక్షకు చేరువలో కుక్క కాటు కేసులు.. లక్ష్యానికి దూరంలో ప్రభుత్వం

కుక్క కరిచిన ప్రాంతంలో రక్తస్రావం అయితే ఈ వ్యాక్సిన్ తో పాటు రెండు రోజుల లోపు కరిచిన చోట ఇమ్మ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.

0 116

– రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న కుక్క దాడులు
– గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తున్న కుక్కలు
– దాడుల్ని ఆపడంతో విఫలమవుతున్న ప్రభుత్వం
– నామమాత్రంగా బర్త్‌కంట్రోల్‌ చర్యలు

నిర్దేశం, హైదరాబాద్: రాష్ట్రంలో వీధికుక్కలు దాడులు ఆగడం లేదు. నగరాలతో పాటు పల్లెల్లో కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయపడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పార్లమెంటులో వెల్లడించిన లెక్కల ప్రకారం.. పోయిన ఏడాది 80 వేలకు పైగా కుక్క కాటు కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి. ఈ కుక్కల దాడిలో చిన్న పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు, మూగ జీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణ ఎనిమిదో స్థానం
కుక్క కాటు కేసుల్లో దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదవ స్థానంలో ఉంది. గడిచిన పదేళ్లలో అంటే 2014 నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య మూడు రెట్లకు పైగానే పెరిగింది. కుక్కల భయంతో చిన్నారులను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వీధులలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలు, మహిళలతో పాటు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో పాటు ఈ దాడులలో మూగ జీవాలు మేకలు, గొర్రెల సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి.

మాంసానికి అలవాటు
ప్రతిరోజు మాంసం దుకాణాలలో వెలువడే మాంసం వ్యర్థాలను దుకాణదారులు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. దీంతో వీధి కుక్కలు మాంసం వ్యర్థాలను తినడానికి అలవాటు పడుతున్నాయి. మాంసం వ్యర్థాలు దొరక్కపోతే అవి క్రూరంగా మారి చిన్న పిల్లలు, మేకలు, గొర్రెలపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు ఒంటరిగా తిరగాలంటేనే భయపడుతున్నారు. కుక్కల జనన నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లే వీధి కుక్కల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. కానీ, రాష్ట్రంలో కేసులు ఎన్ని పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టింపు లేకుండా ఉండోది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం తీరు కనిపిస్తోంది.

కుక్క కాటు జాగ్రత్తలు-సూచనలు
– కుక్క కరిచిన వ్యక్తి ఐదు సార్లు వ్యాక్సిన్ తీసుకోవాలి.
– కుక్క కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
– కుక్క కరిచిన ప్రాంతంలో రక్తస్రావం అయితే ఈ వ్యాక్సిన్ తో పాటు రెండు రోజుల లోపు కరిచిన చోట ఇమ్మ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
– ఈ ఇంజెక్షన్ శరీరానికి ఇమిడియట్ బస్టర్ లా పనిచేస్తుంది. దీనివల్ల రేబిస్ వ్యాధి సోకకుండా ఉంటుంది.
– రేబిస్ వ్యాధి సోకితే ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదని వైద్యులు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking