Take a fresh look at your lifestyle.

సీపీఐ, బీఆర్ఎస్ మైత్రికి నారాయణ చెక్ పెట్టినట్టేనా

0 14

సీపీఐ, బీఆర్ఎస్ మైత్రికి
నారాయణ చెక్ పెట్టినట్టేనా

హైదరాబాద్, మే 12 : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకుంటే కడిగేయడం ఆయన నైజం. అలాంటి సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణకు ఇప్పుడు సొంత పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం నచ్చనట్లుంది. అందుకే టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారట. నారాయణకు తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినా… తెలంగాణ ఉద్యమానికి పార్టీని ఒప్పించిన నేత. అయితే ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టుల రాజకీయ విధానాలపై ఆయన అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. స్మశానాల ప్రైవేటీకరణ, చెప్పులపై జీఎస్టీలను నిరసిస్తూ…ఇటీవల పంజాగుట్ట శ్మశానానికి పాదయాత్ర నిర్వహించారాయన.

అదే సందర్భంలో బీఆర్ఎస్‌తో కమ్యూనిస్టుల మైత్రి అంశం చర్చకు వచ్చిందిహైదరాబాదులో ఉన్న స్మశాన వాటికల్ని కూడా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని తప్పుపడుతూనే సచివాలయంలోకి ప్రతిపక్ష నాయకులు వెళ్ళకుండా అడ్డుకోవడమేంటంటూ సీరియస్ కామెంట్లే చేశారు నారాయణ. ఈ క్రమంలోనే సీపీఐ, బీఆర్ఎస్ మైత్రికి సంబంధించిన ప్రశ్నలు మీడియా వైపు నుంచి రావడంతో అసహనానికి గురయ్యారాయన. మేం ఎవరితో రాజకీయ మైత్రిలో లేమంటూనే తెలంగాణలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఆ నాయకత్వాన్నే అడగండి అంటూ వెళ్లిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత లెఫ్ట్, బీఆర్‌ఎస్ మధ్య బంధం బలపడింది. గులాబీ పార్టీతో కలిసి పనిచేయడానికి కామ్రేడ్స్‌ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు.

ఇది నారాయణకు నచ్చనట్టుంది అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే మైత్రికి సంబంధించిన అంశాలపై కామెంట్ చేయడానికి ఆయన అంత సుముఖంగా లేరన్న వాదన వినిపించింది.ఒకవైపు ప్రభుత్వాన్ని నిందిస్తూనే ఎన్నికల సమయంలో కాపాడే విధంగా మద్దతు ఏంటన్న అంశంపై కమ్యూనిస్టు పార్టీల్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమస్యలపై పోరాటం చేస్తూనే తీరా ఎన్నికల టైం వచ్చేసరికి బీజేపీని కారణంగా చూపి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంపై కూడా చర్చ నడుస్తోంది. అందుకే దీనిపై నారాయణ అంటీ ముట్టనట్టుగా స్పందించారట.

స్థానికంగా ఎవరితో కలిసి పనిచేయాలో నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్ర నాయకత్వాలకు ఇచ్చింది జాతీయ పార్టీ. కాబట్టి ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా తాను స్పందించకూడదనుకున్నారో… లేక స్పందించకుండా… తన మనసులో మాటను చెప్పకనే చెప్పాలనుకున్నారో గానీ… బీఆర్‌ఎస్‌ విషయంలో నారాయణ వ్యవహారశైలి మాత్రం చర్చనీయాంశమైంది. సాధారణంగా మనసులో మాటను కుండబద్దలుకొట్టేస్తూ సీతయ్యగా పేరుపడ్డ నారాయణ మధ్యే మార్గంగా మాట్లాడటమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking