Take a fresh look at your lifestyle.

సీఎం కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ధీమా – ఆరు పథకాలపైనే ఆశలు

0 14

సీఎం కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ధీమా
– ఆరు పథకాలపైనే ఆశలు
– విభేదాలు పక్కన పెట్టి..
– వామపక్షాల పొత్తుతో ముందుకు..

అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి సీఎం కుర్చీపై కూర్చుంటాం అంటున్నాయి నాలుగు పార్టీలు. ప్రజలకు అవసరమగు పథకాలు అందించిన మేమే మూడోసారి గెలిస్తాం హ్యట్రిక్ సాధిస్తాం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు అధికార బీఆర్ఎస్. తెలంగాణ ఇచ్చింది మేమే.. ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఎన్నికలలో గెలిచిన తాము తప్పకుండా ఈసారి అధికారం మాదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు వారు. మరోసారి మోదీ ప్రభంజనంలో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంటుంది భారతీయ జనతా పార్టీ. అయితే.. సీట్లు తక్కువ రావచ్చు.. కానీ హంగ్ ప్రభుత్వంతో తామే కీలకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను బహుజన సమాజ్ పార్టీ స్పష్టం చేస్తుంది.
నిర్దేశం, హైదరాబాద్ :

తిరగబడదాం- తరిమికొడదాం..

కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో ఫుల్‌ జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ గెలుపు తనదేనంటోంది. కొత్త నేతల చేరికలు పార్టీకి ఊపు తీసుకొచ్చినా అదే సమయంలో కొందరు ముఖ్యనేతల నిష్క్రమణలు పార్టీకి సవాలుగా మారాయి. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీకున్నా.. ఏఐసీసీ సర్వేలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ముందే సంకేతాలిస్తున్నారు పార్టీ నేతలు. అభయహస్తం పేరుతో ఆ పార్టీ స్కీములు ప్రకటిస్తోంది. పది పోలింగ్‌ స్టేషన్లకు ఒక ఇంచార్జిని నియమించేలా ఎలక్షనీరింగ్‌పై కసరత్తుచేస్తోంది. అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్‌. తిరగబడదాం- తరిమికొడదాం ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్‌ స్లోగన్‌. అధికారంలో కొచ్చేది తామేనంటోంది. అంతర్గత విభేదాలున్నా, నేతల అలకలు ఆగకున్నా అధికారపీఠం అందుకోవాలన్న టార్గెట్‌తో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది హస్తం పార్టీ. ఆరు గ్యారంటీ స్కీములతో కన్నడ ఫార్ములాని తెరపైకి తెచ్చింది.

ఆరు పథకాలపైనే ఆశలు

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆ ఆరు స్కీములను ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రజల్లోకి వాటిని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. మహిళల కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాస పథకం, చేయూత పథకంతో.. కర్ణాటక విక్టరీ ఇక్కడ కూడా రిపీట్‌ అవుతుందన్నది కాంగ్రెస్‌ ఆలోచన. తన మార్క్‌ స్కీములు ప్రకటించటంతో పాటు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అమలుచేస్తున్న పథకాలకు ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చేలా ఉన్నాయ్‌. కాంగ్రెస్‌ హామీలు షాదీముబారక్‌ తరహా పథకంలో తులం బంగారం ఈ అడిషనల్‌ ఆలోచనే. అగ్రనేతల పర్యటనలు, హామీలతో కాంగ్రెస్‌ ప్రచారానికి హైప్‌వచ్చింది. డిక్లరేషన్లతో అందరి భవిష్యత్తుకూ హామీ ఇస్తోంది హస్తంపార్టీ. వరంగల్‌జిల్లాలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు రాహుల్‌గాంధీ. యూత్‌ డిక్లరేషన్‌తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌. ఇబ్రహీంపట్నం సభలో ప్రియాంకగాంధీ మహిళా డిక్లరేషన్‌ ప్రకటిస్తే, చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఈ డిక్లరేషన్లతో తన పాలసీని ప్రజల్లోకి వెళ్లేలా చేసుకోగలిగింది కాంగ్రెస్‌.

వామపక్షాల పొత్తుతో..

కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అయింది. అంతేకాదు సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చింది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ముందుగా సీపీఎం, సీపీఐకి చెరొక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్ ప్రతిపాదనను కమ్యూనిస్టులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ తలొగ్గి చెరోక రెండు స్థానాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు నుంచి, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ నుంచి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఉన్నారు.

అయినా అక్కడ వామపక్ష పార్టీల బలం ఎక్కువగా ఉండటంతో సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే యోచనలో ఉంది. కాంగ్రెస్‌లో వామపక్షాల పొత్తుపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భేటీ అయిన వామపక్ష నేతలు.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని తీర్మానం చేశారు. అనంతం పలు దఫాలుగా కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు ఎట్టకేలకు పొత్తు ఖరారు అయింది.

సీఎం కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ధీమా

కాంగ్రెస్ పార్టీ సీఎం కుర్చీ తమదేననే ధీమాతో ఉన్నారు. విభేదాలు పక్కన పెట్టి అధిష్టాన వర్గం దిశా నిర్దేశంను అమలు చేస్తూ ఎలక్షన్ లలో వేగం పెంచింది. కేసీఆర్ స్పీచ్ కు దీటుగా సమాధానం చెప్పుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొలిటికల్ అటాక్ చేయడంలోను తక్కువేమి కాదు.. కేసీఆర్ కు దీటైనా మోనగాడు రేవంత్ రెడ్డి అనే టాక్ కూడా ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking