కాంగ్రెస్ మైండ్ గేమ్ – రేవంత్ ఉచ్చులో కేసీఆర్ పడుతారా..?
కాంగ్రెస్ మైండ్ గేమ్
– రేవంత్ ఉచ్చులో కేసీఆర్ పడుతారా..?
– సోనియాగాంధీ సమక్షంలో కేసీఆర్ కు సన్మానం..?
– తెలంగాణ తల్లి సోనియాగా కాంగ్రెస్ వ్యూహం..
– తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కు దూరం కుట్ర..
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ, జర్నలిస్ట్)
రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం. కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి తప్పులు చేసేలా ప్రోత్సహించడం అనే రాజకీయ వ్యూహం చాలా కాలంగా పార్టీల నేతలు అమలు చేస్తున్నారు.
ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా స్థిమితంగా ఉన్న రాజకీయ నాయకుడే కాస్త ఆలస్యమైనా అధికారాన్ని అందుకుంటారు. ఆవేశ పడటమో లేకపోతే తన స్థాయి ఎంతో అని ఊహించుకుని బిగబట్టుకుని ఉండటమో చేస్తే రాజకీయంగా విఫలమవుతూ ఉంటారు. అధికారం పోతే ప్రతిపక్ష నేతలకు కనీస గౌరవం దక్కదు.. దానికి తగ్గట్లుగానే రాజకీయం చేయాలి. తాము ఒకప్పుడు శాసించామంటే.. కుదరదు. ఇలాంటి రాజకీయ పరిస్థితులతో మైండ్ గేమ్ ఆడేందుకు.. మానసికంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టేందుకు నేతలు వాడుకుంటున్నరు. అసేంబ్లీ ఎన్నికల నుంచి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్, బీజేపీలతో మైండ్ గేమ్ తో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.
కేసీఆర్ పై రేవంత్ మైండ్ గేమ్
సీఎం రేవత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను మైండ్ సెట్ తో మానసికంగా బలహీనం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ను ఆహ్వానించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కూడా కావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
సోనియాగాంధీ సమక్షంలో కేసీఆర్ కు..
జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరవుతున్నారు. ఇదే వేదికపై కేసీఆర్‌కు సన్మానం కూడా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో చాలా మందికి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్ కే వస్తే ఎలా ఉంటుంది. అది గౌరవం కన్నాఎక్కువగా అవమానం అని ఫీలయ్యే అవకాశాల ఉంటాయి.
కేసీఆర్ ను సన్మానించాలని..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఆహ్వాన్ని కేసీఆర్‌కు పంపబోతోంది. అయితే ప్రభుత్వ వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ సాధనలో ఓ వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానం చేయడం అంటే ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమేనని బీఆర్ఎస్ భావించే అవకాశం ఉంది.
ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ గుంజుకొచ్చారు..
తెలంగాణను సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతారు. కానీ తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ తల్లి సోనియాగా కాంగ్రెస్ వ్యూహం..
తెలంగాణ తల్లిగా సోనియాను కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. సోనియా ఇవ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ ప్రాధాన్యాన్ని తక్కువ చేసి.. సోనియాను హైలెట్ చేసేందుకే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ధూంధాంగా నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా భావించే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కు దూరం కుట్ర..
కాంగ్రెస్ పార్టీ వ్యూహం చూస్తే తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కు దూరం చేసే వ్యూహమని సులువుగానే అర్థమవుతుంది. అదే సమయంలో కేసీఆర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యూహమని భావిస్తున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ అనే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటిది గుర్తుకు రాకుండా సోనియాను హైలెట్ చేస్తున్నారని.. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా అందుకేనని అనుకుంటున్నారు.
తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టాననని చెప్పే కేసీఆర్ కు ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టేవే. అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏ మాత్రం సదాభిప్రాయం లేదు. ఆయనను లిల్లీ పుట్ లీడర్ గా చాలా సార్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అభినందనలు కూడా తెలియచేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి అనే పేరును కూడా ఆయన నోటి నుంచి వచ్చిన సందర్భాలు తక్కువే. అలాంటి నేత నుంచి సన్మానం పొందాలనే ఆలోచనే కేసీఆర్ ను ఆవేదనకు గురి చేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్-రేవంత్ ముఖాముఖి కాలేరు..
కేసీఆర్ కు కాలి తుంటి విరిగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఇది ఓ రకమైన రివెంజ్ అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్-రేవంత్ ముఖాముఖి ఎదురుపడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా హాజరుకావడం పరస్పర గౌరవానికి సంబంధించిన అంశమనీ, దానిలో భాగంగానే ప్రధాని మోడీ నిర్వహించిన అధికారిక సభకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారని కేసీఆర్ కూడా రావాలని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తూ కేసీఆర్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Translate »
error: Content is protected !!